PM Modi Swearing In Ceremony Live Updates: మూడోసారి భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లోని కర్తవ్య పథ్‌లో ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభా ప్రాంగణమంతా "మోదీ మోదీ" నినాదాలతో దద్దరిల్లింది.
నరేంద్ర మోదీ తరవాత రాజ్‌నాథ్ సింగ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రక్షణశాఖ మంత్రిగా కొనసాగనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ తరవాత అమిత్ షా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మరోసారి హోం మంత్రి పదవిలోనే కొనసాగుతారు. ఇప్పటి వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగిన జేపీ నడ్డాకి ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కింది. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తరవాత నిర్మలా సీతారామన్, మనోహర్ లాల్ ఖట్టర్, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు.
8 వేల మంది అతిథులు హాజరైన ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 7 దేశాల అధినేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు. 2014లో మే 26 వ తేదీన తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. ఆ తరవాత 2019లో మే 30న ఈ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జూన్ 9న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హ్యాట్రిక్ కొడతామని ముందు నుంచి చెబుతూ వచ్చిన మోదీ అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ రికార్డుని సమం చేస్తూ మోదీ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు, రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. అటు గత ఎన్నికలతో పోల్చుకుంటే మెజార్టీ తగ్గినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ని దాటింది. గత రెండు ఎన్నికల్లోనూ మెజార్టీ సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ఈ సారి మాత్రం ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ, జేడీయూ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. టీడీపీకి ఈ సారి కేబినెట్‌లో మూడు మంత్రి పదవులు దక్కాయి. ఈ సారి కేబినెట్‌లో కొత్తగా 7గురికి అవకాశం దక్కింది. కొంత మంది మంత్రులను హైకమాండ్ పక్కన పెట్టింది.