BJP Union Ministers From AP and Telangana | న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. సామాన్య కార్యకర్తల స్థాయి నుంచి ఎదిగిన వారికి బీజేపీ పార్టీలో ఎప్పటికీ గౌరవంతో పాటు పదవి ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఏపీ నుంచి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు చోటు దక్కింది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
‘సామాన్య కార్యకర్తలుగా చేసి అంచెలంచెలుగా ఎదిగిన నేతలకు బీజేపీలో మంచి గుర్తింపు ఉంటుంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇదివరకే పేదలకు 4 కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మరో 3 కోట్ల ఇండ్లు నిర్మించి ఇస్తాం. మోదీ చేయబోయే వంద రోజుల కార్యాచరణను సైతం ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మేం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాం. ప్రజల విశ్వాసంతో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపడుతున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ నాయకత్వంలో మరింత మెరుగైన, అభివృద్ధితో కూడిన పాలన అందిస్తామని’ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో సంబరాలు నిర్వహించాలని పిలుపు
‘కేంద్ర కేబినెట్ లో NDA మిత్రపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చారు. మోదీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం కొలువుదీరుతోంది. తెలంగాణ ప్రజలు నమ్మకం ఉంచి 8 స్థానాల్లో గెలిపించారు. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఏ పార్టీతో పొత్తు లేకుండా తెలంగాణలో సుమారు 35 శాతానికి పైగా ఓట్లు, సీట్లు వచ్చాయి. గత శాసనసభ ఎన్నికల్లో 8 సీట్లలో నెగ్గాం. నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి హృదయపూర్వక శుభాకాంక్షలు.
తెలంగాణ నుంచి కేబినెట్లో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. వచ్చే 5 సంవత్సరాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో సంకల్ప పత్రాన్ని అమలు చేస్తాం. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో బీజేపీని పటిష్టం చేసుకునేందుకు పనిచేద్దాం. పార్టీ విజయం కోసం నేతలు, కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరుతున్నందున దేశ వ్యాప్తంగా, తెలంగాణలోనూ అన్ని మండల కేంద్రాల్లో సంబురాలు నిర్వహించాలని’ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తొలిసారి కేబినెట్‌లోకి బండి సంజయ్, శ్రీనివాస్ శర్మ
కిషన్ రెడ్డి ఇదివరకే మోదీ మంత్రివర్గంలో సేవలు అందించారు. మోదీ 2.0 కేబినెట్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా మొదట కిషన్ రెడ్డి సేవలు అందించారు. అనంతరం ఆ శాఖ తొలగించి కిషన్ రెడ్డికి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆపై ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన మంత్రిగా సైతం కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, కేంద్ర మంత్రి వర్గంలో బండి సంజయ్, శ్రీనివాస్ శర్మలు రావడం ఇది తొలిసారి. బండి సంజయ్ 2019, 2024లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందగా, తాజా ఎన్నికల్లో ఏపీ నుంచి శ్రీనివాస్ శర్మ నరసాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.