PM Modi Swearing In Ceremony: తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ. అయినా సరే మోదీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ దక్షిణాది రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు కాకపోతేనేం..? ఎప్పుడో అప్పుడు కచ్చితంగా అక్కడ ఉనికి చాటుకుంటాం..అనే నమ్మకంతో ఉన్నారు. తమిళనాడులో బీజేపీ చీఫ్‌ అన్నామలై (Annamalai) మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే పని చేశారు. కానీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అక్కడ DMK క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంత జరిగినా సరే అన్నామలై ఎక్కడా వెనక్కి తగ్గలేదు. "కరుణానిధి కొడుకునై ఉంటే నేనూ గెలిచేవాడిని" అని కనిమొళికి చురకలు అంటించారు. నిజానికి రాష్ట్రంలో బీజేపీకి ఆ మాత్రం జోష్ వచ్చిందంటే అది కేవలం అన్నామలై వల్లే. పైగా ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.


2019లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి వచ్చిన ఓటు శాతం కేవలం 3.66%. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది ఏకంగా 11.24%కి పెరిగింది. అంటే రెండంకెల ఓటు శాతాన్ని సాధించుకోగలిగింది కాషాయ దళం. ఈ క్రెడిట్‌ అంతా అన్నామలైకే ఇచ్చేసింది అధిష్ఠానం. అందుకే...మొన్న జరిగిన NDA సమావేశంలో మోదీ తమిళనాడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీట్లు రాకపోయిన ఓట్ల శాతం (Modi Cabinet) పెరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే మోదీ కేబినెట్‌లోకి అన్నామలైకి ఆహ్వానం అందడం అత్యంత ఆసక్తికర పరిణామం. బీజేపీ తమిళనాడుపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఓడిపోయినా సరే తమిళనాడు వ్యక్తి కేంద్రమంత్రి పదవి ఇచ్చి తమ ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెప్పేందుకు బీజేపీ అమలు చేస్తున్న వ్యూహం ఇది. 




ఎవరీ అన్నామలై..?


అన్నామలై పూర్తి పేరు కుప్పుసామి అన్నామలై. కర్ణాటకలో IPS ఆఫీసర్‌గా పని చేశారు. ఉడుపి, చిక్‌మగ్‌లూర్, బెంగళూరులో ఎక్కువ కాలం బాధ్యతలు చేపట్టారు. "రియల్ సింగం" అనే పేరునీ సంపాదించుకున్నారు. 2019లో ఉన్నట్టుండి ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి రాజీనామా  చేశారు. తమిళనాడులోని కరూర్‌ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టారు. దీని వెనకాల ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2018లో అన్నామలై మానస సరోవర యాత్ర చేశారు. "ఈ యాత్ర తరవాతే నాకు ఏం కావాలో తెలిసింది" అని చెప్పారు. సరిగ్గా సంవత్సరం తరవాత ఖాకీ డ్రెస్‌ని విడిచి పెట్టారు. ఆ తరవాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు.


అంతే కాదు. అప్పట్లో సూపర్‌ స్టార్ రజినీ కాంత్ పెట్టిన పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ రేసులో ఉన్నారు. కానీ రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీకి తెరపడింది. ఆ సమయంలోనే అన్నామలై బీజేపీలో చేరారు. ముక్కుసూటిగా మాట్లాడేతనం, ద్రవిడ రాజకీయాలను తట్టుకుని గట్టిగా నిలబడడం, పార్టీ క్యాడర్‌ని కాపాడుకోవడం లాంటివి చేయడం వల్ల ఆయన హైకమాండ్ దృష్టిలో పడ్డారు. అందుకే పార్టీలో చేరిన పది నెలలకే పార్టీ చీఫ్‌గా ఎదిగారు. ఇప్పుడు బీజేపీకి ఓటు షేర్ పెంచడంలోనూ అన్నామలై కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ...పిలిచి మరీ అన్నామలైకి కేబినెట్‌లో అవకాశం ఇస్తోంది. 


 Also Read: Nitin Gadkari: ఫలితమిచ్చిన పదేళ్ల కష్టం, మళ్లీ గడ్కరీకే రవాణాశాఖ - ఇదీ ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్