PM Modi Oath Ceremony: "కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇండియాలోని రహదారులన్నీ అమెరికా రోడ్లలా మెరిసిపోతాయి" కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తరచూ చెప్పిన మాటలివి. చెప్పడమే కాదు. అంత నిబద్ధతతోనూ పని చేస్తున్నారాయన. పలు రాష్ట్రాల్లో రహదారుల విస్తరణ, కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. గత పదేళ్లుగా ఆయన చేపట్టిన పనులతో మంచి పేరు తెచ్చుకున్నారు. జాతీయ రహదారుల విస్తరణా మెరుగు పడింది. ఆయన శ్రమను గుర్తిస్తూ మరోసారి అదే మంత్రిత్వ శాఖను అప్పగించింది అధిష్ఠానం. మరోసారి ఆయన రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. 2023 చివర్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 నుంచి 2023 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా రోడ్ నెట్‌వర్క్ విస్తరణ 60% మేర పెరిగింది. 2014లో 91,287 కిలోమీటర్లు ఉండగా అది ప్రస్తుతం 1,46,145 కిలోమీటర్లకు చేరుకుంది. ఇదంతా గడ్కరీ హయాంలోనే జరిగింది. సింగిల్ లేన్ రహదారుల సంఖ్య తగ్గిపోగా నాలుగు లేన్‌ల రహదారుల సంఖ్యని 2.5 రెట్లు పెంచారు. గడ్కరీ పదవీ కాలంలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు 143% మేర పెరిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అంతే కాదు. Bharat New Car Assessment Programme అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు గడ్కరీ. కార్‌లు ఎంత వరకూ సేఫ్ అని చెప్పేందుకు ప్రత్యేకంగా ఈ NCAP రేటింగ్ ప్రవేశపెట్టారు. ఫలితంగా చాలా మందికి భద్రత పట్ల అవగాహన పెరిగింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎంపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసిన నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రత్యర్థిపై లక్షా 37 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌ని అందమైన నగరంగా తీర్చి దిద్దాలన్నదే తన కల అని స్పష్టం చేశారు. కాలుష్య రహిత దేశాన్ని చూడాలనుకుంటున్నట్టు వివరించారు.