PM Modi Swearing In: మోదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి అన్ని ఏర్పాట్లూ చురుగ్గా జరుగుతున్నాయి. ఇవాళ (జూన్ 9) సాయంత్రం 7.15 నిముషాలకు మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు 7 దేశాల అధినేతలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో సందడి మొదలైంది. నగరవ్యాప్తంగా మోదీ పోస్టర్లు వెలిశాయి. పలు చోట్ల ఆయన అభిమానులు బ్యానర్లు పెట్టారు. అయోధ్య రామ మందిర ప్రారంభ ఉత్సవానికి సంబంధించిన మోదీ ఫొటోలను పలు చోట్ల ఏర్పాటు చేశారు. బీజేపీ జెండాలూ పెద్ద ఎత్తున ఎగురుతున్నాయి. ఇక సిటీలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా 1,100 మంది ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగనుంది. దీంతో పాటు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు పోలీసులు. జూన్ 10వ తేదీ వరకూ ఢిల్లీని No-flying Zone గా ప్రకటించారు.
"మోదీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1,100 మంది పోలీసులను రంగంలోకి దింపాం. సిబ్బంది అన్ని సూచనలు, సలహాలు ఇచ్చాం. రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి వేరే వాహనాలకు అనుమతి ఉండదు. ఆ మేరకు అందరికూ మార్గదర్శకాలు జారీ చేశాం"
- ప్రశాంత్ గౌతమ్, ట్రాఫిక్ డీసీపీ
ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు..
రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ తరవాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు మోదీ రాజ్‌ఘాట్‌ని సందర్శించనున్నారు. అక్కడ మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. పలు దేశాధినేతలు తరలి వస్తుండడం వల్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. విదేశాధినేతలు ఉండే హోటళ్ల వద్దా సెక్యూరిటీ పెంచారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ చేయనున్నారు. ఆ మేరకు భద్రతా వలయాన్ని మరింత పెంచనున్నారు.