Kodali Nani News: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, సదరు భూమిని బాధితులు స్వాధీనం చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కొడాలి నాని కబ్జా చేసినట్లుగా భావిస్తున్న తొమ్మిది ఎకరాల భూమిని బాధితులు తిరిగి  స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడం, గుడివాడలోనూ కొడాలి నాని ఓడిపోవడంతోనే తాము తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని బాధితులు తెలిపారు.


ఆ 9 ఎకరాల భూమికి గతంలో కొడాలి నాని కంచె వేయించగా.. రెండు జేసీబీలను తెప్పించి కబ్జా చేసిన భూమి చుట్టూ ఉన్న కంచెలను బాధితులు తొలగించారు. ‘‘కొడాలి నాని అరాచకాలు నశించాలి’’ అంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 


ఈ సందర్భంగా మీడియాతో బాధితులు మాట్లాడుతూ.. ‘‘బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి, వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడు. న్యాయం కోసం పోలీసులను వేడుకున్నాం కోర్టులను ఆశ్రయించాం..  ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాం. అయినా మాకు న్యాయం దక్కలేదు... వెనిగండ్ల రాము వల్లే నేడు మాకు న్యాయం జరిగింది. 


అందరినీ 420 అనే కొడాలి నానినే అసలైన 420. కొడాలి నానిని గుడివాడ నుండి తరిమి కొడతాం. మళ్లీ కొడాలి నానిని రాజకీయాల్లోకి రాకుండా చేస్తాం. ఆశలు వదిలేసుకున్న తరుణంలో మా పాలిట దైవంలా వెనిగండ్ల రాము అండగా నిలబడ్డారు. ఇటువంటి మంచి వ్యక్తులు గుడివాడకు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని  కోరుకుంటున్నాం. రాము ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం గుడివాడకు అంత మంచే జరుగుతుంది’’ అని బాధితులు మీడియాతో మాట్లాడారు.