AUS vs ENG Highlights, T20 World Cup: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్(England)కు ఆస్ట్రేలియా(Austrelia) షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారీ స్కోర్లు నమోదైన వేళ... కంగారుల ముందు బ్రిటీష్ జట్టు తేలిపోయింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ట్రానిస్ హెడ్.. టీ 20 ప్రపంచకప్‌లోనూ అదే ఊపు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది.
బాదుడే బాదుడు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్.. ట్రావిస్ హెడ్ తొలి బంతి నుంచే ఇంగ్లాండ్‌పై విరుచుకుపడ్డారు. ఎడాపెడా బౌండరీలు బాదేశారు. దీంతో ఆస్ట్రేలియా కేవలం 4.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు... డేవిడ్ వార్నర్ కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 70 పరుగులు చేసింది. వార్నర్‌ను మొయిన్ అలీ బౌల్డ్ చేయగా.... జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ వెనుదిరిగాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుట్ అవ్వడంతో ఆస్ట్రేలియా పవర్‌ప్లేను 74-2తో ముగించింది. తర్వాత కెప్టెన్ మిచెల్ మార్ష్ 25 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 పరుగులు.. మార్కస్ స్టాయినిస్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరి విధ్వంసంతో ఆస్ట్రేలియా 200 పరుగుల మార్క్‌ను దాటింది. చివర్లో టిమ్ డేవిడ్ 11, మాథ్యూ వేడ్ 17 పరుగులతో పర్వాలేదనిపించారు. కంగారు బ్యాటర్లలో ఎవరూ కనీసం అర్ధ శతకం చేయకపోయినా భారీ స్కోరు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, అదిల్ రషీద్ 1, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీశారు.
శుభారంభం దక్కినా
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్-జోస్ బట్లర్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. ఓపెనర్ల మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ పవర్‌ప్లే ముగిసే సరికే వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. కానీ మిచెల్ స్టార్క్ వేసిన ఏడో ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్ 7 ఓవర్లకు 73 పరుగులు చేసి సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. కానీ ఆడమ్ జంపా.. ఇంగ్లాండ్‌ను చావు దెబ్బ తీశాడు. తొలుత ఫిల్ సాల్ట్‌ను అవుట్ చేసిన జంపా... తర్వాత బట్లర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 23 బంతుల్లో 37 పరుగులు చేసి సాల్ట్.. 28 బంతుల్లో 42 పరుగులు చేసి బట్లర్ అవుటయ్యారు. పది ఓవర్లలో ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగుల రాక కష్టమైంది. మిగిలిన బ్యాటర్లందరూ తడబడడంతో ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది. కంగారు బౌలర్లలో జంపా రెండు వికెట్లు తీశాడు. దీంతో 36 పరుగుల తేడాతో బ్రిటీష్ జట్టుపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.