Nassau County International Cricket Stadium: భారత్‌-పాక్‌(IND vs PAK) మ్యాచ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ... అభిమానుల కోలాహలం... ఆటగాళ్ల వ్యూహాలు... బలాలు-బలహీనతలు ఇలాంటి వాటిపై ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ జరగనున్న దాయాదుల పోరులో అందరి చూపు న్యూయార్క్‌లోని నసావు స్టేడియం(Nassau County International Cricket Stadium)లోని పిచ్‌పైనే ఉంది. ఇప్పటివరకూ ఒక్క భారీ స్కోరు నమోదు కానీ ఈ పిచ్‌పై ఈ ప్రపంచకప్‌లోనే కీలకమైన మ్యాచ్‌ నిర్వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి మ్యాచ్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని కూడా డిమాండ్లు వినిపించాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఈ పిచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్‌పై మ్యాచ్‌లో భారత్‌-పాక్ ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.


 

పిచ్‌పైనే అందరిచూపు

 భారత్‌-పాక్‌ మధ్య జరిగే ఈ పోరుకు నసావు పిచ్‌ను కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా స్పందిస్తూ పరుగులు రావడమే గగనమైన ఈ పిచ్‌పై మ్యాచ్‌ను ఎలా నిర్వహిస్తారంటూ ఐసీసీపై నెటిజన్లు మండిపడ్డారు. నసావు స్టేడియంలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో 150 పరుగులు కూడా దాటలేదు. భారత్‌ పాక్‌ మ్యాచ్‌లోనూ అదే పునరావృతమైతే అభిమానులకు నిరాశ తప్పదు.  ఈ మ్యాచ్‌ కోసం పిచ్‌లో ఏమైనా మార్పులు చేశారేమో చూడాలి. అయితే ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకూ ఉపయోగించని పిచ్‌ను వాడాలని చూస్తున్నారు. అలా ఉపయోగిస్తే పిచ్‌ ఎలా స్పందిస్తున్నది చూడాలి. ఈ పిచ్‌పై ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో  రెండుసార్లు మాత్రమే జట్లు 100 పరుగుల మార్కును అధిగమించాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో లో స్కోరింగ్ నమోదైతే అది ఉత్కంఠభరితంగా సాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. ఐర్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భుజానికి కూడా బంతి బలంగా తగలడంతో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరి దాయాదుల సమరంలో కొత్త పిచ్‌ను ఉపయోగిస్తే అది బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లకే సహకరిస్తుందా అన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. ఈ పిచ్‌పై భారత స్టార్‌ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ దళం... షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్తాన్ బౌలింగ్ బృందాల్లో ఎవరు ప్రభావవంతంగా మారుతారో చూడాలి.

 

కుల్‌దీప్‌ రాక ఖాయమేనా..?

నసావు పిచ్‌పై కుల్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కుల్‌దీప్‌ జట్టులోకి వస్తే రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం కావడం ఖాయం. రోహిత్, విరాట్ కోహ్లి ఓపెనర్లుగా కొనసాగుతారని, రిషబ్ పంత్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ వస్తాడని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో ఈ మ్యాచ్‌కే అత్యధిక మంది ప్రేక్షకులను వస్తారని అంచనా వేస్తున్నారు. కొత్తగా నిర్మించిన నాసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 34 వేల సీట్ల సామర్థ్యం ఉంది. ఈ మ్యాచ్‌లో అన్ని సీట్లు ఫుల్‌ కావడం మాత్రం ఖాయం.