PM Modi Oath Ceremony : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. 2019లోనూ రెండో సారి ఎన్డీయే ఘన విజయంతో రెండో సారి ప్రధాని అయ్యారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఢిల్లీలో మోడీ సహా కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి సహా 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులు ఉన్నారు.
మిత్రపక్షాలకు ప్రాధాన్యం18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా.. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకు మొత్తం 293 సీట్లతో మెజారిటీ సాధించింది. పాత మంత్రివర్గంలోని 22 మంది ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో కొత్త క్యాబినెట్లో చాలా మంది కొత్త వాళ్లకు చోటు కల్పించారు. సంకీర్ణ సర్కార్ క్యాబినెట్‌లో మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు కూడా భాగం అయ్యారు. ఎన్డీయే 3.0లో టీడీపీ, నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా మారాయి.
బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీ ప్రతినిధులకు ప్రాధాన్యత పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి క్యాబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు క్యాబినెట్ బెర్త్ దక్కింది. మోడీ నివాసంలో వీరంతా తేనీటి విందుకు హాజరయ్యారు.
క్యాబినెట్ లో కొత్త ముఖాలుప్రభుత్వంలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారే. ఎన్డీయే కూటమి మిత్ర పక్షాలైన టీడీపీకి చెందిన రామ్‌మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జేడీయూ నుంచి లాలన్‌సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, శివసేనకు చెందిన ప్రతాప్‌రావు జాదవ్‌తో పాటు ఎల్‌జేపీకి చెందిన చిరాగ్ పాశ్వాన్, హెచ్‌ఏఎంకు చెందిన జితన్‌రామ్ మాంఝీ, జేడీఎస్‌కు చెందిన హెచ్‌డీ కుమారస్వామి, జయంత్ చౌదరి, ఆర్‌ఎల్‌డీకి చెందిన రాందాస్ అథవాలే, ఆర్‌పీఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నా దళ్‌కు చెందిన అనుప్రియ పటేల్, బీజేపీ కి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ కుమార్, రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా కేంద్ర మంత్రి మండలిలో కొత్తగా చేరనున్నారు.