Ram Mohan Naidu Join Modi 3.0 Union Cabinet: కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయేకు కీలక మిత్రపక్షమైన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు (36) నిలవనున్నారు. గతంలో ఆయన తండ్రి ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా సేవలు అందించగా, నేడు తొలిసారి కేంద్ర మంత్రిగా యువనేత రామ్మోహన్ నాయుడు ప్రమాణం చేశారు.


తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 
కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. ప్రస్తుతం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు. బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఆయన టీడీపీ నేత బండారు సత్యనారాయణ కుమార్తె శ్రావ్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నిహిరఅన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తండ్రి మృతితో రామ్మోహన్‌నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 


 



రామ్మోహన్ నాయుడు టాలెంట్‌తో హ్యాట్రిక్ విజయాలు
తండ్రి వారసత్వం అందిపుచ్చుకున్న ఆయన టాలెంట్ తో వరుస విజయాలు సాధించారు. తొలిసారి 2014లో శ్రీకాకుళం లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 1.27 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో తొలిసారి నెగ్గారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా నడుస్తున్న సమయంలో టీడీపీ నెగ్గిన కొన్ని ఎంపీ స్థానాల్లో రామ్మోహన్ నాయుడు నెగ్గిన శ్రీకాకుళం స్థానం ఒకటి. ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓడిపోయినా.. ఎంపీగా గెలిచి అద్భుతం చేశారని చెప్పవచ్చు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు.