PM Modi Took Charge In PMO: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆయన మూడోసారి తన విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పీఎంవోలోని (PMO) ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


తొలి సంతకం దానిపైనే..






మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి  17వ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 'రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేస్తాం. మాది కిసాన్ కళ్యాణ్‌‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం.' అని ప్రధాని పేర్కొన్నారు.


కేబినెట్ భేటీ


కేంద్ర మంత్రి వర్గం 3.0 కొలువుదీరిన క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ భేటీ కానుంది. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు శాఖలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు, కొత్త ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణపైనా మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, స్పీకర్ ఎన్నిక వంటి అంశాలపైనా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అటు, పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read: PM Modi Cabinet 3.0: కొలువుదీరిన ప్రధాని మోదీ కేబినెట్ 3.0 - ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారో?