'జై భీమ్' చూశానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. తనకు సినిమా చూసినట్టు లేదన్నారు. నిత్యం జరిగే దుర్మార్గాల్లో ఒక అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని చెప్పారు. దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమా చూస్తుంటే... 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఓ ఘటన తన కళ్ల ముందు మెదిలిందని ఆయన వివరించారు.
"నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్న రోజులవి. కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ గూడు లేక రాత్రి సమయాల్లో ఏదో ఒక ఫ్లాట్‌ఫార్మ్ మీద నిద్రించేది. తిరుపతిలో ఒక రోజు బీట్ కానిస్టేబుల్స్ ఎప్పటిలా తమ లాఠీలతో పని చేస్తున్నారు. ఫ్లాట్‌ఫార్మ్స్ మీద బిక్షగాళ్లు భయంతో పరుగులు తీస్తున్నారు. లక్ష్మి పరిగెట్టాలని ప్రయత్నించగా... పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పుడామె పక్కన రోజూ ఆడించే కోతి మాత్రమే ఉంది. యువజన నాయకుల ద్వారా విషయం తెలిసింది. వాళ్లతో పాటు నేనూ ఘటనా స్థలానికి చేరుకున్నాను. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడు బండిపై ఉంచి నిరసన ప్రారంబించాం. పాతికమందితో ప్రారంభమైన నిరసన... వందల మందికి చేరుకుంది. మరుసటి రోజు బంద్‌కు పిలుపు ఇచ్చాం. బంద్ రోజున ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తిరుమల పర్యటన ఉంది. దాంతో రాత్రి 11-12 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి... నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయనికి తీసుకెళ్లారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావ్ గారు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ ఉన్నారు. బంద్ ఉపసంహరించుకోమని అడిగారు. వారి ప్రతిపాదనను తిరస్కరించా. 'చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆస్తిపరూరాలు కాదు, కుల బలం లేదు. ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకు, మీ పార్టీకి లాభం ఏమిటి?' అని అధికారులు ఇద్దరూ అడిగారు. కేసులు పెడతామని చెప్పారు. సామాజిక చైతన్యం, ప్రజల్లో ధైర్యం, అధికారులు బాధ్యతగా వ్యవహరించడం కోసం బంద్ అని చెప్పాను. బంద్ విజయవంతమైంది. నాపై కేసులు పెట్టారు. వారం రోజులు చిత్తూరు సబ్ జైల్లో ఉన్నాను" అని సీపీఐ నారాయణ చెప్పారు.
'జై భీమ్' చూస్తుంటే... అప్పటి ఘటన కళ్లముందు మెదిలిందని చెప్పారు. లక్ష్మి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు ఆమె చేతిలో పెరిగిన కోతి మృతదేహాన్ని అంటి పెట్టుకొని ఉండడం హృదయాన్ని బరువెక్కించిందని ఆయన పేర్కొన్నారు. అప్పటి ఉద్యమం తిరుపతిలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడడానికి ఊతం ఇచ్చిందన్నారు.
Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం
Also Read: శ్యామ్ సింగ రాయ్... తిరగబడిన సంగ్రామం వాడే! వెనకబడని చైతన్యం వాడే!
Also Read: భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు! ఆ తర్వాత ఏమైంది?
Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..
Also Read: దంచికొడితే రోలు పగిలిందంతే... జయమ్మగా సుమ కనకాలను చూశారా?
Also Read: తామర... సితార సంస్థ నిర్మిస్తున్న తొలి ఇండో-ఫ్రెంచ్ సినిమా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి