కశ్మీర్ లోయలో హిందువులు, ముఖ్యంగా పండిట్ వర్గంపై తీవ్రవాదులు జరిపిన దమనకాండను వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన సినిమా 'ద కశ్మీర్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు నటించారు. మార్చి 11న సినిమా విడుదలైంది. లో పబ్లిసిటీతో విడుదలైనా... వసూళ్ల పరంగా జోరు చూపిస్తోంది. పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దర్శక - నిర్మాతలను కలిశారు. ప్రశంసించారు. దాంతో ఈ సినిమాపై అందరి కన్ను పడింది. సినిమాలో ఏముంది? ఎలా ఉంది? అనేది పక్కన పెడితే... బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 'ద కశ్మీర్ ఫైల్స్'కు పన్ను మినహాయింపు ఇచ్చారు.


హర్యానా
'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించిన తొలి రాష్ట్రం హర్యానా. సినిమా టికెట్స్ మీద జీఎస్టీ వసూలు చేయవద్దని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలను మార్చి 11న (సినిమా విడుదల రోజునే) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


గుజరాత్ 
మార్చి 12 (సినిమా విడుదలైన మరుసటి రోజు)న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి పన్ను మినహాయింపు ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.


మధ్యప్రదేశ్ 
హర్యానా, గుజరాత్ తర్వాత 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ప్రకటించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. సోమవారం సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు  వెల్లడించారు. అంతే కాదు, సినిమా చూడటం కోసం పోలీసులకు సెలవు కూడా ఇచ్చారు.


Also Read: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ప్రధాని మోదీ మెచ్చిన సినిమా, అంతగా ఏముందంటే?


కర్ణాటక, గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సైతం 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ "కశ్మీర్ లో 80, 90లలో జరిగిన నిజాన్ని 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా వెలుగులోకి తీసుకొచ్చింది. కశ్మీర్ పండిట్లకు తమ భూభాగం వెనక్కి తిరిగొస్తుందని, వాళ్ళు సెటిల్ అవుతారని ఆశిస్తున్నా" అని తెలిపారు.


Also Read: ఐఎండీబీపై విరుచుకుపడ్డ ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు - అలా ఎందుకు చేసిందో?