వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. మొదటి రోజు రూ.3.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు ఏకంగా రూ.12 కోట్లకు పైగా... మూడో రోజు రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఐఎండీబీలో 10/10 రేటింగ్స్ సాధించిందని చిత్ర బృందం పోస్టర్లలో కూడా వేసింది.


అయితే ప్రస్తుతం ఐఎండీబీలో ఈ సినిమాకు 8.3/10 ‘వెయిటెడ్ యావరేజ్’ రేటింగ్‌ను చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంత స్థాయిలో రేటింగ్ పడిపోవడానికి కారణంగా ఐఎండీబీ తన రేటింగ్ సరళిని మార్చడమే. ఈ సినిమాకు సంబంధించి ‘అసాధారణమైన ఓటింగ్ యాక్టివిటీ’ కనిపించడాన్ని కారణంగా చూపిస్తూ ఐఎండీబీ తన రేటింగ్స్ లెక్కించే విధానాన్ని మార్చింది.


ఈ విషయంపై సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. ఐఎండీబీ చర్య అనైతికం అయినది అన్నారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి, భాషా సుంబాలి తదితరులు ఈ సినిమాలో నటించారు.


వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి?
ఐఎండీబీ ‘రా డేటా యావరేజ్’ బదులు ‘వెయిటెడ్ డేటా యావరేజ్‌’ను పబ్లిష్ చేస్తుంది. వినియోగదారులు చేసిన అన్ని ఓట్లను తాము యాక్సెప్ట్ చేసినప్పటికీ వాటిలో అన్ని ఓట్లనూ ఫైనల్ రేటింగ్‌కు పరిగణనలోకి తీసుకోబోం. అసాధారణమైన ఓటింగ్ యాక్టివిటీ కనిపించినప్పుడు ఐఎండీబీ ఈ తరహా యావరేజ్‌ను పరిగణిస్తుంది. తమ సిస్టం మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తామని ఐఎండీబీ అంటోంది. ఈ రేటింగ్ మెకానిజం ప్రభావవంతంగా ఉండటం కోసం దీన్ని జనరేట్ చేసే పద్ధతిని తెలపబోమని ఐఎండీబీ ప్రకటించింది.


ఈ విషయాన్ని ఒక ట్విటర్ యూజర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇది ‘అసాధారణమైనది, అనైతికమైనది’ అన్నారు. వివేక్ అగ్నిహోత్రికి కొందరు ఫ్యాన్స్, నెటిజన్లు ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు.