సామాజిక అంశాలను వెండితెరపై తెరకెక్కించడానికి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ముందుంటారు. ఇదివరకు ఆయన రూపొందించిన 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' అనే సినిమా భారీ ఆదరణ పొందింది. తాజాగా 90వ దశకంలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండ నేపథ్యంలో దర్శకుడు వివేక్ 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ లు కీలకపాత్రలు పోషించారు. మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ వస్తోంది. హర్యానా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఈ సినిమాకి పన్ను మినహాయింపును కూడా ప్రకటించాయి. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రధాని మోదీని కలిసింది. ఈ విషయాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రధాని తమ సినిమాను ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. 


ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. 


తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.