'ఆర్ఆర్ఆర్' విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ సినిమాలో కొంత మంది విదేశీ నటీనటులు కూడా నటించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒలీవియా మోరిస్ గురించి! ఆలియా భట్ కంటే ఆమెకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. 'నాటు నాటు' పాటలో ఆమె వేసిన స్టెప్పులు, ఆమె హావభావాలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ - ఒలీవియా మధ్య సన్నివేశాలు చక్కటి వినోదం కూడా ఉంది. అయితే... సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. బహుశా... విడుదల తేదీలు మారుతూ ఉండటంతో షెడ్యూల్స్ మధ్య ఇండియా రావడం వీలు పడలేదేమో!
ఒలీవియా మోరిస్ ఇండియా రాలేదు సరే! మరి, సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఏం పోస్ట్ చేశారు? 'నాటు నాటు' పాటకు ముందు ఆమెతో డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపించిన మరొక ఫారిన్ యాక్టర్ ఉన్నారు కదా! అతడి పేరు ఎడ్వర్డ్! ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో స్టెప్పులు వేయలేక అలసిపోయినట్టు కనిపించింది ఆయనే. అఫ్‌కోర్స్... 'నాటు నాటు'లో ఒలీవియా మోరిస్ కూడా స్టెప్పులు వేయలేక అలిసిపోయినట్టు కనిపించారు. సినిమా విడుదల సందర్భంగా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో రామ్ చరణ్‌కు థాంక్స్ చెప్పారు.
Also Read: 'టెంపర్'లో 627 - 'RRR'లో ఎన్టీఆర్ ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
"ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ఇండియన్ సినిమాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాలో నన్ను ఒక భాగం చేసిన రాజమౌళి గారికి థాంక్స్. మహమ్మారి కాలంలోనూ నాపై ప్రేమ, అభిమానం చూపిస్తూ... సాదరంగా స్వాగతించిన ప్రేక్షకులు, అభిమానులకు థాంక్స్. నేను బెస్ట్ ఇచ్చేలా ఇన్స్పైర్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు థాంక్స్. ఇండియన్ సినిమా మేజిక్ ను థియేటర్లలో చూడాలని ఎదురు చూస్తున్నాను" అని ఒలీవియా మోరిస్ పేర్కొన్నారు. ఎడ్వర్డ్ సైతం రాజమౌళికి థాంక్స్ చెప్పారు. రెండు రోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుందని అలీసన్ డూడీ పోస్ట్ చేశారు.