RRR మూవీ పల్స్ ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఎప్పటిలాగానే రాజమౌళి తన మార్క్‌ చిత్రంతో ఫుల్ విజువల్ ట్రీట్ ఇచ్చాడు. అక్కడక్కడ చిన్న చిన్న లోపాలున్నా.. ఓవరల్‌గా చూస్తే, అది పెద్ద లెక్కలోకి రాదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని రెండు పాటల గురించి చెప్పుకోవాలి. ఒక పాట.. సీట్లో నుంచి లేచి స్టెప్పులు వేయించేలా ఉంటే.. మరొకటి, కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తుంది. అవే.. ‘నాటు నాటు’, ‘కొమరం భీమ్’ సాంగ్స్. 


ఉక్రేయిన్‌లో చిత్రీకరించిన ‘నాటు.. నాటు..’ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసినప్పుడు ఎంత క్రేజ్ లభించిందో తెలిసిందే. ఇద్దరు కలిసి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీల్స్, షార్ట్స్‌లో సందడి చేశాయి. అయితే, అది జస్ట్ సాంపిల్ మాత్రమేనని సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. సినిమాలో మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఆ పాట ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే కాసేపు దుమ్ము రేగ్గొడుతుంది. ఇక అభిమానులకైతే పూనకాలు పక్కా. రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇప్పటివరకు మనం వీరి డ్యాన్స్‌ను విడివిడిగా మాత్రమే చూశాం. అలాంటిది వీరిద్దరూ పక్క పక్కనే డ్యాన్స్ చేస్తుంటే.. పక్కోడి కళ్లు కూడా అరువు తెచ్చుకుని చూడాలనిపిస్తుంది. కనీసం ఆ పాటకోసమైనా మరోసారి సినిమాకు వెళ్లాలనే భావన అభిమానుల్లో కలగవచ్చు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని స్టెప్పులైతే.. బొమ్మలే కదులుతున్నాయా? అనే భావన కలుగుతుంది. అంతగా చరణ్-తారక్‌లు తమ కెమిస్ట్రీని పండించారు. వీరి బ్రోమాన్స్ చూస్తే వీరాభిమానులకు కూడా ముచ్చట వేస్తుంది. అయితే, ఈ పాటలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. అది స్క్రీన్ మీద మాత్రమే చూడాలి. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' రివ్యూ: నందమూరి - కొణిదెల అభిమానులకు పండగే!


ఇక ‘కొమరం భీముడో’ సాంగ్ వింటే.. కన్నీళ్లు ఆగవు. ముఖ్యంగా ఈ పాట మనసులోకి వెళ్లి తెలియకుండానే గుండెను భారం చేస్తుంది. ఇక పాటలో ఎన్టీఆర్ చేసిన అభినయాన్ని చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. కాలభైరవ గాత్రం.. ఈ పాటకు చాలా ప్లస్ అని చెప్పుకోవాలి. అప్పటి వరకు థియేటర్లలో సందడి చేసే అభిమానులు.. ఈ పాటను చూస్తూ సైలెంట్ అయిపోయారంటే అది ఎంత డీప్‌గా మనసులోకి చొచ్చుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆ పాటను మీ గుండెల్లో నుంచి బయటకు పోదని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం RRRకు ‘నాటు నాటు’, ‘కొమరం భీముడో’ సాంగ్స్, ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, చరణ్-తారక్‌ల నటన, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు. మంచి చిత్రం కాబట్టి.. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్. RRR సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. చిత్రంలోని ఫీల్ మిస్ కాకుండదంటే.. తప్పకుండా థియేటర్లలోనే ఈ చిత్రాన్ని చూడాలి. ‘నాటు నాటు’, ‘కొమరం భీముడో’ సాంగ్స్‌పై ఆడియన్స్ స్పందనను కింది ట్విట్లలో చూడండి.


Also Read: ‘RRR’ ట్విట్టర్ రివ్యూ - ఇదేంటీ, టాక్ ఇలా ఉంది!