సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడడంతో అర్ధరాత్రి నుంచే రచ్చ మొదలైంది. మెగా నందమూరి అభిమానుల హడావిడి మాములుగా లేదు. సెలబ్రిటీలు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. 


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బెనిఫిట్ షో చూడాలని కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్‌ కి వెళ్లింది. అక్కడ ఆమె అభిమానులతో కలిసి రచ్చ హంగామా చేసింది. హీరోల ఇంట్రడక్షన్ సమయంలో అభిమానుల మాదిరి తాను కూడా కేరింతలు కొట్టింది. పేపర్లు గాల్లోకి విసురుతూ.. తెగ సంతోషపడింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 


'నాటు నాటు' సాంగ్ రాగానే చరణ్, ఎన్టీఆర్ స్టెప్స్ చూసి ఆనందపడింది ఉపాసన. అప్పుడు కూడా పేపర్లు గాల్లోకి విసిరింది. మొత్తానికి 'ఆర్ఆర్ఆర్' మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. అన్ని చోట్లా తమ అభిమాన హీరోలని థియేటర్లో చూడడానికి పోటీ పడుతున్నారు ఫ్యాన్స్. నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా.. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ నటించారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.