ఏపీ, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు అంచనా వేశాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి (మార్చి 25) వచ్చే 5 రోజుల పాటు వర్ష సూచన ఏమీ లేదు. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు, ఏపీలో బుధవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. మొన్న అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదుగా మయన్మార్‌కు చేరుకుని తాండ్వే వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావం స్వల్పంగా ఏపీపైనా కనిపించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలోనూ తేలికపాటి వర్షం పడింది. గాలి గంటకు 30 నుంచి 40 కి.మీ. దాకా వీచింది.
‘‘ఈ రోజు, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఎండలు కొనసాగనుంది. వర్షాలు విశాఖ ఏజెన్సీలో అక్కడక్కడ నమోదవ్వనుంది. కానీ ఈ నెల 26 నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుంది. కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండలు, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో 41 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతల నుంచి ఇటీవలి వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. తెలంగాణలో పలు జిల్లాల్లో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత వారం రోజుల్లో నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్టు విడుదల చేసింది. కొత్తగూడెం, వనపర్తిల్లో అధికంగా, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణంగా హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రం భీమ్, మహబూబాబాద్, నారాయణ్ పేట, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తక్కువ వర్షపాతం, జోగులాంబ గద్వాలలో ఇంకా తక్కువగా, మిగతా జిల్లాల్లో అసలు వానలే లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.