శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas) ఈ రోజు ఉదయం దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. 'ఆదిపురుష్' విజయం సాధించాలని కోరుకున్నారు. ప్రభాస్ రాకతో తిరుమలలో సందడి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


శ్రీ రామచంద్రమూర్తి & వెంకటేశ్వర స్వామి... ఇద్దరూ విష్ణుమూర్తి అవతారాలు అని చెబుతుంటారు. శ్రీరామునిగా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకను విష్ణుమూర్తి మరో అవతారమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పాదాల చెంత... తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఆ వేడుక కోసం సోమవారం సాయంత్రమే ప్రభాస్ తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్నారు. 


ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి!
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, మత గురువు, యోగి సన్యాసి అయినటువంటి చినజీయర్ స్వామి వస్తున్నారు. ఆయన ఓ సినిమా వేడుకకు వస్తుండటం ఇదే ప్రథమం. 


ప్రీ రిలీజ్ ప్రత్యేకతలు ఏమిటంటే?
లక్ష మందికి పైగా భక్తులు, ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు వస్తారని ఓ అంచనా. వేదిక దగ్గర ప్రభాస్ 50 అడుగుల హోలో గ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తిరుపతిలో అయోధ్య భారీ సెట్ వేశారు. సుమారు వంద మంది గాయనీ గాయకులు, డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. సంగీత దర్శకులు అజయ్, అతుల్ ఈ కార్యక్రమం కోసం ముంబై నుంచి తిరుపతికి బైక్ మీద వచ్చారు.


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో...
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా ఓ దర్శకుడిని నిర్మాతలు ఏర్పాటు చేశారు. 'అ!', 'కల్కి', త్వరలో విడుదల కానున్న 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డైరెక్షన్ చేస్తున్నారని చిత్ర బృందం పేర్కొంది. నటి, స్టార్ యాంకర్ ఝాన్సీ ఈవెంట్ హోస్ట్ చేయనున్నారు.


Also Read : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!



'ఆదిపురుష్'లో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తొలి రోజు వసూళ్ల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


పీపుల్స్ మీడియా చేతికి 'ఆదిపురుష్'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న 'స్పిరిట్' తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేలా ఒప్పందం జరిగిందట. 


టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.


Also Read : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!