నిర్మాత అంటే డబ్బులు పెట్టేవారు. దర్శకుడు అంటే సినిమా తీసేవారు. ఇప్పుడు అటువంటి గీతలు ఏమీ లేవు. దర్శకులు సైతం నిర్మాణ వ్యవహారాల్లో చేతులు పెడుతున్నారు. అలా పెట్టకూడదని రూలేమీ లేదు. అయితే, సినిమా విజయం సాధించినప్పుడు ఎటువంటి విమర్శలు రావడం లేదు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దర్శకులకు ఎక్కడ లేని తలనొప్పులు వస్తున్నాయి. అందుకు ఉదాహరణ... 'ఆచార్య', 'లైగర్', తాజాగా 'ఏజెంట్' సినిమాలు!


కొరటాల, పూరి దగ్గరకు వెళ్లిన డిస్ట్రిబ్యూటర్లు!
'ఆచార్య' డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను భర్తీ చేయమంటూ దర్శకుడు కొరటాల శివ ఆఫీసుకు వెళ్లారు. హీరో చిరంజీవికి విషయం చెప్పి తమకు న్యాయం చేయమని అడిగినా... కొరటాల ఆఫీసుకు ఎందుకు వెళ్లారు? అంటే బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేసింది ఆయనే కాబట్టి! 'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్లు గొడవ అందరికీ తెలిసిందే. ధర్నాల వరకు వెళ్ళింది. 'లైగర్' నిర్మాతల్లో పూరి జగన్నాథ్ ఒకరు కనుక ఆ గొడవ. ఆ సినిమాల విషయంలో జరిగిన పరిణామాలను స్ఫూర్తిగా తీసుకున్నారో... మరొకటో... 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ కూడా సేమ్ రూట్ ఫాలో అయ్యారు. సినిమాను హోల్ సేల్ రైట్స్ కొన్న గాయత్రీ ఫిలిమ్స్ అధినేత సురేందర్ రెడ్డి దగ్గరకు వెళ్లారు. 


సురేందర్ రెడ్డి దగ్గరకు 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్!
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'ఏజెంట్' మొదటి రోజు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా విడుదలకు ముందు హైప్ ఉండటంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చాయి. రెండో రోజు నుంచి డల్ అయ్యింది. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాస్ వచ్చింది. దర్శకుడితో హీరో, నిర్మాతలకు చెడింది. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా తీశామని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. దాంతో టర్మ్స్ అండ్ కండిషన్స్ బాలేదని క్లారిటీ వచ్చింది.


Also Read : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు!


'ఏజెంట్' నిర్మాణ సంస్థల్లో సురేందర్ రెడ్డి ప్రొడక్షన్ హౌస్ సరెండర్ 2 సినిమా కూడా ఉంది. అందువల్ల, డిస్ట్రిబ్యూటర్లు ఆయన దగ్గరకు వెళితే మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగే సమాధానం వచ్చిందట. ఎలా లేదన్నా సరే... 'ఏజెంట్' సినిమాకు రూ. 25 కోట్లు లాస్ వచ్చింది. సురేందర్ రెడ్డి నుంచి నిర్మాతలకు లేదా రైట్స్ కొన్న గాయత్రీ ఫిలిమ్స్ అధినేతకు గానీ ఒక్క రూపాయి కూడా రాదని క్లారిటీ వచ్చింది. 


సురేందర్ రెడ్డికి ఫుల్ పేమెంట్ ఇవ్వలేదా?
'ఏజెంట్' సినిమాకు గాను తనకు రూ. 12 కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పారని, అయితే అందులో సగం మాత్రమే ఇచ్చారని, మిగతా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేదని, ఆ డబ్బులను నిర్మాత దగ్గర తీసుకోమని సురేందర్ రెడ్డి చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. నిర్మాతకు కూడా బోలెడు నష్టం వచ్చింది. ఇటువంటి తరుణంలో ఆయన ఆరు కోట్లు ఎలా ఇస్తారు? 'ఏజెంట్' విషయంలో ఇన్ని గొడవలు జరిగిన నేపథ్యంలో సురేందర్ రెడ్డి కూడా డబ్బులు వెనక్కి ఇస్తారా? డౌటే! పాపం... సినిమా డిస్ట్రిబ్యూటర్ అనుకోవడం తప్ప ఇండస్ట్రీ జనాలు ఏమీ చేయలేరు. 


Also Read మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?