సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఓ ఫీల్ గుడ్ ఫిల్మ్ వస్తే ఎలా ఉంటుంది? అదీ సున్నితమైన కథలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎంత బావుందో కదూ! నిజం చెప్పాలంటే... ఆ ఊహ వాస్తవం అవుతుందని కొన్ని రోజుల క్రితం తెలుగు ప్రేక్షకులు భావించారు. 


మహేష్ బాబు హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలని సీనియర్ దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ట్రై చేశారు. అందులో కథానాయికగా దీపికా పదుకోన్ (Deepika Padukone)ని అనుకున్నారు. అయితే... ఆ సినిమా ఎందుకు సెట్స్ మీదకు వెళ్ళలేదు? అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయంత్ చెప్పారు. 


'ఫిదా' కథ నచ్చినా సరే...
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'ఫిదా' (Fidaa Movie). ఇందులో హీరోగా ఫస్ట్ ఛాయస్ మెగా ప్రిన్స్ కాదు. తొలుత ఈ కథను జయంత్ సి. పరాన్జీకి చెప్పారు శేఖర్ కమ్ముల. మహేష్ బాబు హీరోగా సినిమా తీయాలని! పరాన్జీకి కథ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఒకటికి రెండుసార్లు ఆయన విన్నారు. తానే ప్రొడ్యూస్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు దగ్గరకు శేఖర్ కమ్ములను తీసుకు వెళ్లారు. హీరోతో 'టక్కరి దొంగ' చేసిన అనుభవం, పరిచయం ఆయనకు ఉన్నాయి. మహేష్ బాబుకూ కథ నచ్చేసింది. అయితే, చిన్న చిన్న మార్పులు చేయాలని సూచించారు. మహేష్ బాబుకు కలిసి కథ వినిపించిన శేఖర్ కమ్ముల... ఆయన చెప్పిన మార్పులు చేసేశారు. 


అంతా సెట్ అనుకుంటున్న సమయంలో 'ఫిదా' కథకు మహేష్ బాబు సూపర్ స్టార్ ఇమేజ్ సూట్ అవ్వదేమోనని ఫీల్ అయ్యారు జయంత్ సి. పరాన్జీ. దాంతో కథ నచ్చినా సరే... పక్కన పెట్టేశామని చెప్పారు. అంతే కాదు... 'టెర్మినేటర్'ను లియోనార్డో డికాప్రియానోతోనూ, 'టైటానిక్'ను ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ హీరోగానూ తీయలేమని వ్యాఖ్యానించారు. తమకు ఏదైతే చెప్పాడో, అదే కథను 'ఫిదా'గా శేఖర్ కమ్ముల తీశారని, అదొక అందమైన ప్రేమకథ అని, సినిమా కూడా తనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. అదీ సంగతి!


ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాలకు వస్తే... తండ్రి కృష్ణ జయంతి రోజున (మే 31) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే, వీడియో గ్లింప్స్ కూడా! మిర్చి కంటే ఘాటుగా మహేష్ బాబును త్రివిక్రమ్ ప్రజెంట్ చేశారని ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.


Also Read : శర్వానంద్ పెళ్ళైపోయిందోచ్ - రక్షితతో ఏడడుగులు వేసిన హీరో



 మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Also Read 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?