బుల్లితెరపై ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది ‘జబర్దస్త్’ కామెడీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యారు. చక్కటి కామెడీ టైమింగ్స్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం ఈ షో కమెడియన్స్ అంతా బాగానే సెటిల్ అయ్యారు. కొంత మంది ఇప్పటికే కొత్త ఇండ్లు కొనుక్కోవడంతో పాటు పెళ్లి చేసుకుని హ్యాపీగా జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మరో టీమ్ లీడర్ మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇంతకీ తను ఎవరో కాదు కెవ్వు కార్తిక్.
కార్తిక్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
తన పెళ్లి గురించి కెవ్వు కార్తిక్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పాడు. తాజాగా తనతో కలిసి దిగిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశాడు. అమ్మాయి పేరు సిరి అని మాత్రమే చెప్పాడు. మిగతా వివరాలు ఏవీ బయటకు వెల్లడించలేదు. “పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నాను. కానీ. ఆ సమయంలో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. రెండు భిన్నమైన ఆత్మలు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు, జీవిత ప్రయాణ పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి. నా జీవితానికి స్వాగతం సిరి” అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. అంతకు ముందు పోస్టులో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన కెవ్వు కార్తిక్. అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. కానీ, ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ “మన లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వస్తే, జీవితం మరింత అందంగా, హ్యాపీగా ఉంటుందని కొందరు చెప్పారు. బహుశా అది ఇదేనేమో” అంటూ రాసుకు వచ్చాడు. తన జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థాంక్స్ అని చెబుతూనే, నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు.
ఉద్యోగానికి రాజీనామా చేసి, మిమిక్రీ ఆర్టిస్టుగా మారిన కార్తిక్
ఇక కెవ్వు కార్తిక్ గురించి చెప్పాలంటే, సాధారణ కంటెస్టెంట్ గా ‘జబర్దస్త్’ షోలోకి అడుగు పెట్టి, చక్కటి కామెడీతో టీమ్ లీడర్ గా ఎదిగాడు. తనదైన మార్క్ పంచులతో అందరినీ అలరిస్తాడు. ఎలాంటి డబుల్ మీనింగ్ పంచులు లేకుండా చక్కటి కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కార్తిక్, అక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఓవైపు ఇంజనీరింగ్ చదువుతూనే, మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఎంటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ, తనకు మిమిక్రీ, కామెడీ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఉద్యోగాన్ని వదిలి, హైదరాబాద్ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. ఆ తర్వాత ‘కామెడీ క్లబ్’, ‘జబర్దస్త్’ షోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, దుబాయ్ సహా పలు దేశాల్లో స్టేజి షోలు ఇచ్చాడు. ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోలో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు.
Read Also: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?