యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఓ ఇంటివాడు అయ్యారు. నిన్న రాత్రి (జూన్ 3వ తేదీ) పదకొండు గంటలకు రక్షిత (Sharwanand wife Rakshita) మెడలో ఆయన మూడు ముళ్ళు వేశారు. ఏడు అడుగులు నడిచారు. ఇక నుంచి శర్వానంద్ బ్యాచిలర్ కాదు... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నుంచి ఆయన పేరును తెలుగు చిత్రసీమ తీసేసింది.

పెళ్లి ఎక్కడ జరిగిందంటే?
శర్వానంద్, రక్షితల వివాహ మహోత్సవానికి జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్‌ వేదిక అయ్యింది. మూడు నాలుగు రోజుల క్రితమే నూతన వధూవరులతో పాటు ఇరువురి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు జైపూర్ వెళ్ళారు.  

Sharwanand Wedding Details : జూన్ 2వ తేదీ ఉదయం హల్దీ వేడుక జరిగింది. అదే రోజు సాయంత్రం సంగీత్ నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి పెళ్లి జరిగింది. శర్వా క్లోజ్ ఫ్రెండ్, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan)తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.  


శర్వా భార్య రక్షిత ఎవరు?
Sharwanand Wife Rakshitha Biography : శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి పేరున్న లాయర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈ రక్షిత అని తెలిసింది. అంతే కాదు... ఆమె మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు కూడా! జనవరి 26న వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. పెళ్లి కూడా సన్నిహిత మిత్రుల మధ్య చేసుకున్నారు శ్వరానంద్. మ్యారేజ్ ఫోటోలను ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. ప్రస్తుతం శర్వా, రక్షిత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ వేడుక సందడిగా జరిగినట్లు వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. 


Also Read : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?






వరుస సినిమాలతో బిజీ బిజీగా శర్వానంద్!
ఇప్పుడు శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు ఆయన చేసిన 'ఒకే ఒక జీవితం' తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను మెప్పించింది. విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. 


Also Read : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?



ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆ సినిమా కాకుండా సితార సంస్థలో కూడా ఓ సినిమా అంగీకరించారని తెలిసింది. సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా శ్వరానంద్ సిద్ధంగా ఉన్నారు. 


రవితేజతో శర్వా సినిమా!
రవితేజ, శర్వానంద్ ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్ట్  చేయనున్నారు. అందులో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం రవితేజ, శర్వా చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని టాక్.