Poonam Pandey: కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ నటి పూనమ్ పాండే చేసిన ఫేక్ మృతి స్టంట్.. ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. తను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందని ప్రకటించిన మరుసటి రోజే బ్రతికే ఉన్నానంటూ ఫ్యాన్స్ ముందుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు అంతా తనపై ఫైర్ అయ్యారు. అవగాహన కల్పించే తీరు ఇది కాదని మండిపడ్డారు. ఆ స్టంట్ ముందు వరకు పూనమ్ పాండే సోషల్ మీడియాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అప్పటినుండి తను ఏం పోస్ట్ చేసినా.. ఆసక్తికరంగా దానిని గమనిస్తున్నారు. అలా తాజాగా పూనమ్ పాండే చేసిన పోస్ట్ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది.


పోస్టులు మాయం..


మూడు రోజుల క్రితం ‘నిజం త్వరలోనే బయటపడుతుంది’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది పూనమ్ పాండే. తాజాగా దానికి సంబంధించిన మరొక పోస్ట్‌ను షేర్ చేసింది. ‘నిజం బయటికొస్తుంది అని చెప్పినందుకు స్టేక్ హోల్డర్స్ అంతా వణికిపోయారు. మాకు లీగల్ నోటీసులు పంపించారు’ అని తెలిపింది. అసలు ఏం జరుగుతుంది? తను చెప్పాలనుకున్న నిజమేంటి? తనపై లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలనుకున్న ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరు? అని నెటిజన్లలో సందేహాలు మొదలయ్యాయి. కానీ పూనమ్ పాండే మాత్రం వీటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అంతే కాకుండా తాను బ్రతికే ఉన్నానని క్లారిటీ ఇచ్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తూ పలు పోస్టులు షేర్ చేసింది పూనమ్. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టులు కూడా మాయం అవ్వడంపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






మృతికి సంతాపం..


ఫిబ్రవరీ 2న పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆరోజంతా తన మరణానికి సంబంధించిన చాలామంది సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తూ ఉండిపోయారు. కానీ పూనమ్ మరణిస్తే తన మృతదేహం ఏది అంటూ కొందరిలో సందేహం మొదలయ్యింది. అసలు తను మరణించి ఉండదు అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయంలోపు పూనమ్ పాండే మరణించలేదని కన్ఫర్మ్ అయ్యింది. అదే రోజు తాను మరణించలేదని చెప్తూ.. ఒక వీడియోను విడుదల చేసింది పూనమ్. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అంతా షాక్ అయ్యారు. 


వీడియోతో క్లారిటీ..


‘‘ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను బ్రతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ నా ప్రాణం తీయలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా అరికట్టాలో తెలియని ఎన్నో వేల మంది మహిళల ప్రాణాలను మాత్రం తీసింది. మిగతా క్యాన్సర్‌ల లాగా కాకుండా సర్వైకల్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్స్, డిటెక్షన్ టెస్టులే దీనికి పరిష్కారం. ఎవరూ ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా మన దగ్గర సౌకర్యాలు ఉన్నాయి. దీనిపై ప్రతీ ఒక్కరు అవగాహన తెచ్చుకొని, ప్రతీ మహిళ దీనికోసం కావాల్సిన చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు వహిద్దాం’’ అంటూ సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసమే తాను ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది పూనమ్ పాండే.


Also Read: కమెడియన్‌ సతీష్‌తో కీర్తి సురేశ్ పెళ్లి - ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన హీరోయిన్ తల్లి