Arjun Son Of Vyjayanthi Review - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రివ్యూ: కమర్షియల్ టెంప్లేట్‌లో తీసిన సినిమా... మదర్ & సన్‌ సెంటిమెంట్ హిట్ ఇస్తుందా?

Arjun Son Of Vyjayanthi Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. హీరో తల్లిగా విజయశాంతి నటించారు. ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

Continues below advertisement

Nandamuri Kalyan Ram and Vijayashanthi's Arjun Son Of Vyjayanthi Movie Review In Telugu: నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ప్రదీప్ చిలుకూరు దర్శకత్వం వహించారు. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మించారు. థియేటర్లలో ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Continues below advertisement

కథ (Arjun Son Of Vyjayanthi Story): ఐపీఎస్ అధికారి వైజయంతి విజయశాంతి కుమారుడు అర్జున్ (నందమూరి కళ్యాణ్ రామ్). తనలానే కొడుకు కూడా ఐపీఎస్ కావాలని ఆమె కలలు కంటుంది. అయితే తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా విశాఖను తన కను సైగలతో శాసించే స్థాయికి ఎదుగుతాడు అర్జున్.

సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన అర్జున్... ఖాకీ చొక్కా ఎందుకు వేయలేదు? అతను వంద హత్యలు చేసినా సరే ఎవరూ ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు? అర్జున్ మీద కన్నతల్లి వైజయంతి ఎందుకు కేసు పెట్టింది? కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది? ముంబైలో కరుడుగట్టిన తీవ్రవాది మహమ్మద్ జియాయుద్దీన్ పఠాన్ (సోహెల్ ఖాన్) నుంచి తన తల్లికి ప్రాణహాని ఉందని తెలుసుకున్న అర్జున్ ఏం చేశాడు? విశాఖ కమిషనర్ ప్రకాష్ (శ్రీకాంత్) పాత్ర ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Arjun Son Of Vyjayanthi Review Telugu): కమర్షియల్ పంథా నుంచి కథానాయకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా బయటకు వచ్చే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు టెంప్లేట్ సినిమాలు తగ్గాయి‌. 'అతనొక్కడే' నుంచి 'బింబిసార' వరకు కొత్త తరహా కథలతో సినిమాలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో ప్రారంభం నుంచి ముగింపు వరకు కమర్షియల్ ఫార్ములాను నమ్ముకుని సినిమా చేయడం ఆశ్చర్యపరుస్తుంది.

ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి ఎంట్రీ నుంచి మొదలు పెడితే... తల్లిని కాపాడడం కోసం పతాక సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ చేసే ఫైట్ వరకు... ప్రతిదీ కమర్షియల్ టెంప్లేట్ అండ్ ఫార్ములాలో సాగుతుంది. క్లైమాక్స్ ఫైటులో హీరో చేసే ఒక్క షాకింగ్ పని తప్ప మిగతాదంతా ప్రేక్షకులు ఊహకు అందుతుంది. ఓ రచయితగా, ఓ దర్శకుడిగా ప్రదీప్ చిలుకూరు ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే ప్రయత్నం చేయలేదు. కమర్షియల్ ఫార్ములా నుంచి బయటకు రాలేదు. దాంతో సినిమా కొత్తగా ఏమీ అనిపించదు. 

యాక్షన్ సన్నివేశాలు మాత్రం నందమూరి అభిమానులు, మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా తీశారు. కమర్షియల్ పంథాలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' తీయడంలో మాత్రమే ప్రదీప్ చిలుకూరు సక్సెస్ అయ్యారు. మదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. అయితే ఆ ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఇంకా బాగా తీయవచ్చు. కానీ, ఆ దిశగా ప్రయత్నం చేయలేదు‌. హీరోయిజం ఎలివేట్ అయ్యేలా డైలాగులు రాశారు. అయితే... ఈ తరహా కథలు గానీ, సినిమాలు గానీ ప్రేక్షకులకు కొత్త కాదు. ఇప్పటికే చాలా చూసేశారు. కళ్యాణ్ రామ్ కోసం, విజయశాంతితో కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కోసం వెళ్లాలంతే!

టెక్నికల్ పరంగా చూస్తే... సంగీత దర్శకుడు అజనీష్ వీకెస్ట్ వర్క్ ఈ సినిమా అని చెప్పాలి. నేపథ్య సంగీతంలో ఆయనకు మంచి పేరు ఉంది. అయితే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఆర్ఆర్ (నేపథ్య సంగీతం) చేసినట్లు చేశారు తప్ప ఆయన మార్క్ చూపించలేదు. పాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చాక గుర్తు ఉండవు. సి రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ సైతం కమర్షియల్ పొందాలో సాగింది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడ లేదని ప్రతి సన్నివేశంలో కనిపించింది.

Also Read: ఓదెల 2 రివ్యూ: తమన్నా నట విశ్వ రూపమా? 'అరుంధతి' తరహా చిత్రమా? సినిమా హిట్టా? ఫట్టా?

కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఈ కథ, క్యారెక్టర్, సినిమాకు తగ్గట్టు చేశారు. కమర్షియల్ హీరోగా తన మార్క్ చూపించారు. ఆయన నుంచి ప్రేక్షకులు ఆశించే విధంగా చేశారు. విజయశాంతిని చాలా రోజుల తర్వాత యాక్షన్ పాత్రలో చూడడం ప్రేక్షకులకు ఒక మెమరీ. ఆమె ఇంట్రో సీన్ బావుంది. యాక్షన్ అదరగొట్టారు. క్లైమాక్స్ లో కొంతసేపు కూడా తన మార్కు చూపించారు. సయీ మంజ్రేకర్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం లేదు. ఆమెది టిపికల్ కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్. అందుకు తగ్గట్టు చేశారు. బబ్లూ పృథ్వీరాజ్ కొంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ చేశారు. సోహైల్ ఖాన్ చేయడం వల్ల విలన్ గెటప్ కొత్తగా కనిపించింది. సరిగ్గా వాడుకోవాలి గానీ తెలుగులో విలన్స్ కొరత తీర్చేలా ఉన్నాడు. 

కమర్షియల్ సినిమా లవర్స్ కోసం తీసిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ సీన్స్‌ కామన్ ఆడియన్స్‌కు నచ్చుతాయి. తల్లి కోసం కొడుకు చేసే త్యాగం కొందరి చేత అయినా కంటతడి పెట్టిస్తుంది. ఈ మూవీని కళ్యాణ్ రామ్ కోసం, విజయశాంతితో కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కోసం, యాక్షన్ సీన్స్‌ కోసం చూడొచ్చు. అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు.

Also Read'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?

Continues below advertisement
Sponsored Links by Taboola