ప్రభాస్ (Prabhas)తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కనుక 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారా? లేదంటే సినిమాపై ఉన్న క్రేజ్ చూసి తీసుకున్నారా? అని అడిగితే... ప్రభాస్ తమకు ఆప్తులు అని, ఆయనతో సంబంధాలు ప్రైమరీ అని చెబుతూనే క్రేజ్ ఉంది కనుక తీసుకున్నామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) చెప్పారు.


ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఓ సినిమా నిర్మిస్తోంది. అనూహ్యంగా 'ఆదిపురుష్' విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. అయితే... 'ఆదిపురుష్' రైట్స్ తీసుకోమని ప్రభాస్ తమను అడగలేదని, క్రేజ్ ఉంది కనుక తీసుకున్నామని, తీసుకునే ముందు ప్రభాస్ తో డిస్కస్ చేశామని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. అయితే... ఆయన ఇంకా సినిమా చూడలేదు.


అమెరికాలో 'ఆదిపురుష్' చూస్తా!
'ఆదిపురుష్' చూశారా? అని ప్రశ్నించగా... 'లేదు' అని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''విడుదలకు ముందు సినిమా చూసే అలవాటు నాకు లేదు. మా సంస్థలో నిర్మించే సినిమాలను కూడా ఎప్పుడూ ముందు చూడలేదు. ఇంతకు ముందు రషెస్ కూడా చూసేవాడిని కాదు. ఈ మధ్య చూస్తున్నాను. ప్రతి సినిమా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూస్తాను. 'ఆదిపురుష్' సినిమా నాకు అందుబాటులో ఉంది. కావాలనుకుంటే చూడొచ్చు. కానీ, చూడలేదు. అమెరికాలో సిటాడెల్ లో ప్రీమియర్ ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ చూస్తాను'' అని చెప్పారు.  


తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' రేట్స్ పెరిగాయ్!
'ఆదిపురుష్' చిత్ర నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు 50 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఎలాగో ఫ్లెక్సిబుల్ రేట్స్ ఉన్నాయి కనుక రేటు పెంచుకోవచ్చు. విడుదల రోజున ఉదయం నాలుగు గంటలకు షోస్ వేసుకోవడానికి కూడా అనుమతులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో మ్యాగ్జిమమ్ నాలుగు గంటలకు పడవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా తమకు సానుకూల స్పందన లభించిందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, 'ఆదిపురుష్' చిత్ర బృందం పేర్కొంది.  బహుశా... ఈ రోజు టికెట్స్ బుకింగ్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం రాత్రి కొన్ని థియేటర్లలో బుకింగ్స్ మొదలు అయ్యాయి. 


'ఆదిపురుష్' టికెట్స్ కొంటున్న స్టార్స్! 
'ఆదిపురుష్' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా హుషారుగా సాగుతున్నాయి. హిందీలో రణబీర్ కపూర్, అనన్యా బిర్లా పదివేల టికెట్స్ చొప్పున కొని సినిమా చూడలేని ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. 'కార్తికేయ 2' నిర్మాత అభిషేక్ అగర్వాల్ సైతం పది వేల టికెట్స్ కొని ఇస్తున్నట్లు చెప్పారు. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ ఖమ్మంలో ఒక్కో రామాలయానికి వందేసి టికెట్స్ చొప్పున ఇవ్వనున్నారు. 


Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ


జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున 'ఆదిపురుష్' థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. 


Also Read : 'గుంటూరు కారం'లో అందాల ఘాటు - మహేష్ సినిమాలో శ్రీలీల లుక్కు