సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వం వహిస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ హిట్స్ తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న చిత్రమిది. 


'గుంటూరు...'లో  ఓ అందాల ఘాటు!
'గుంటూరు కారం' సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. అందులో శ్రీలీల (Sreeleela) ఒకరు. ఇటు మహేష్ బాబు జోడీగా, అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో... ఇద్దరితో ఆమెకు తొలి చిత్రమిది. ఈ రోజు శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చీర కట్టుకుని నెయిల్ పోలిష్ వేసుకుంటూ... అందాల బొమ్మలా మెరిసిపోయారు. లుక్ చూస్తుంటే... సినిమాలో ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రలో సందడి చేస్తారని అర్థం అవుతోంది. 






'మాస్ స్ట్రైక్'కు రెస్పాన్స్ మామూలుగా రాలేదు!
మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సినిమా టైటిల్ వెల్లడించారు. 'మాస్ స్ట్రైక్' పేరుతో వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరూమహేష్ బాబును చూపించనటువంటి మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపించారు. మిర్చి యార్డులో ఫైట్స్ విజువల్స్ ఘట్టమనేని అభిమానులను మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 


గుంటూరు నేపథ్యంలో...
మాస్ యాక్షన్ ఫిల్మ్ గురూ!
కర్రసాముతో రౌడీలను చితక్కొడుతూ 'మాస్ స్ట్రైక్'లో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా, తలకి ఎర్ర కండువా... ఆయన సరికొత్త మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నోటిలో నుంచి బీడీ తీసి, స్టైలుగా వెలిగించి 'ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలా ఫిదా చేశారు మహేష్. గుంటూరు నేపథ్యంలో మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిలింగా 'గుంటూరు కారం'ను రూపొందిస్తున్నారు. 'మాస్ స్ట్రైక్'కు తమన్ ఇచ్చిన నేపథ్యం సంగీతం పూనకాలు తెప్పించింది.


Also Read : టాలీవుడ్‌లోకి త్రిష 'మెగా' రీ ఎంట్రీ - చిరంజీవితో...



'గుంటూరు కారం'లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మరో కథానాయికగా నటిస్తున్నారు. 'మహర్షి' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.


Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ


సెంటిమెంట్ పక్కన పెట్టిన త్రివిక్రమ్!
'గుంటూరు కారం' కోసం త్రివిక్రమ్ ఓ సెంటిమెంట్ పక్కన పెట్టారు. సాధారణంగా 'అ' అక్షరంతో మొదలయ్యే పేర్లను టైటిళ్లుగా పెట్టడం కొన్నాళ్లుగా ఆయనకు అలవాటు అయ్యింది. 'అ' లేకుండా గతంలో కొన్ని సినిమాలకు టైటిల్స్ పెట్టారు. అయితే, కొంత విరామం తర్వాత 'అ'తో కాకుండా వేరే అక్షరంతో మొదలైన త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే.