తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన ఘనుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao). విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఆ మహానుభావుడి విగ్రహాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే... ఆ ప్రయత్నానికి మధ్యలో బ్రేకులు పడ్డాయి. ఎందుకు? అసలు ఏం జరిగింది? అనేది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
శత జయంతికి ఎన్టీఆర్ విగ్రహ స్థాపన చేయాలని...
నార్త్ అమెరికా సీమ ఆంధ్ర అసోసియేషన్ (NASAA)తో కలిసి న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహ స్థాపనకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సంకల్పించారు. అదీ అన్నగారి శత జయంతికి విగ్రహావిష్కరణ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆ రోజు విగ్రహావిష్కరణ జరగలేదు. ఎందుకు? అని టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)ను అడగ్గా...
''ఎడిసన్ సిటీ గవర్నర్ నుంచి అవసరమైన అనుమతులను మేం తీసుకున్నాం. మే నెలలో విగ్రహావిష్కరణ చేయాలని ప్లాన్ చేశాం. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారు? అంటూ కమ్యూనిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో మాకు సమస్య వచ్చింది. దాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాం'' అని టీజీ విశ్వప్రసాద్ సమాధానం ఇచ్చారు.
తెలుగు కమ్యూనిటీ వ్యతిరేకించింది!
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేశారు? వ్యతిరేకించినది ఎవరు? అనేది చెప్పడానికి టీజీ విశ్వప్రసాద్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ పేరు చెప్పడం భావ్యం కాదన్నారు. అయితే... ఇండియన్ కమ్యూనిటీ, అదీ తెలుగు కమ్యూనిటీ నుంచి తమకు అనుమతులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.
కృష్ణుడిగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకోలేదు!
న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తాము పెట్టాలనుకున్న విగ్రహం కృష్ణుడిగా ఎన్టీఆర్ రూపం కాదని, ఒకవేళ తాము అనుకుంటే ఎన్టీఆర్ కృష్ణుడి రూపాన్ని పెట్టడం పెద్ద పని ఏమీ కాదని ఆయన వివరించారు. అనుమతులు వచ్చిన తర్వాత సమస్య ఉత్పన్నం కావడంతో అడుగులు ముందుకు పడలేదన్నారు. తాము త్వరలో సమస్యను పరిష్కరించి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను వ్యతిరేకించడం వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? లేదంటే మరో సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే అంశం మీద అమెరికాలో తెలుగు సంఘాలు మౌనం వహిస్తున్నాయి. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, ముఖ్యంగా కృష్ణుడి రూపంలో పెట్టాలనుకోవడం మీద కొందరు విమర్శలు చేసిన విషయం విధితమే. కరాటే కళ్యాణి అప్పట్లో విమర్శలు చేయడంతో ఆమెను 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) నుంచి సస్పెండ్ చేశారు.
Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విషయానికి వస్తే... ఆ సంస్థలో పవన్ కళ్యాణ్ 'బ్రో' 25వ సినిమా. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఆదిపురుష్' తెలుగు స్టేట్స్ థియేట్రికల్ హక్కులను రూ. 165 కోట్లు ప్లస్ జీఎస్టీ చెల్లించి సొంతం చేసుకుంది. 'వెంకీ మామ', 'ఓ బేబీ', 'ధమాకా', 'కార్తికేయ 2' వంటి విజయవంతమైన చిత్రాలను ప్రొడ్యూస్ చేసింది. ప్రస్తుతం 15 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వచ్చే ఏడాది ఆఖరికి 50 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తామని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.
Also Read : ఏపీలో షూటింగులు - దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా!