జనంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వస్తున్నారు. జూన్ 14 (రేపటి) నుంచి ఏపీలో ఆయన వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాకినాడ జిల్లా నుంచి రోడ్ షో మొదలు పెడుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు కూడా! పవర్ స్టార్ సినిమా అంటే బోలెడు క్రేజ్ ఉంటుంది! ఆయన హీరోగా రెండు మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరి, వాటి సంగతి ఏమిటి? అంటే... ఆల్రెడీ దర్శక నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారట. 


ఏపీలో పవన్ సినిమా షూటింగులు!
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' సెట్స్ మీద ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' సినిమా చిత్రీకరణకు కాస్త విరామం గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వారాహి యాత్ర, ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అయితే? షూటింగుల సంగతి ఏమిటి? అంటే... రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే అని జనసేన సన్నిహిత వర్గాల నుంచి సమాధానం వినబడుతోంది. 


జనసేన కేంద్ర కార్యాలయంలో యాగశాలను సోమవారం చిత్రసీమ ప్రముఖులు సందర్శించారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఇండస్ట్రీ హిట్ 'అత్తారింటికి దారేది' నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. యాగశాలను సందర్శించిన ప్రముఖుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' దర్శక నిర్మాతలు హరీష్ శంకర్, రవి శంకర్ ఉన్నారు. 'ఓజీ' నిర్మాత డీవీవీ దానయ్య, 'బ్రో' సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, 'హరి హర వీరమల్లు' నిర్మాత ఏఎం రత్నం కూడా ఉన్నారు.


Also Read : పూజా హెగ్డే డిమాండ్ తగ్గలేదు - ఏకంగా ఆరు సినిమాలు...


ఏపీలో... మరీ ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణలకు ఏర్పాట్లు చేసుకోమని దర్శక, నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పారని తెలుస్తోంది. వారాహి యాత్ర, ఆ తర్వాత రాబోయే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజీ కానున్నారు. ఎక్కువ సమయం జనసేన కేంద్ర కార్యాలయంలో ఉండనున్నారు. అందుకని, ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ పెట్టుకోమని చెప్పారట. షూటింగులు గుంటూరుకు మార్చడానికి తాము సిద్ధమని నిర్మాతలు సైతం వెల్లడించారు. తమ కథానాయకుడికి వాళ్ళు మద్దతు ప్రకటించారు. 


రాత్రివేళల్లో చిత్రీకరణలు చేసేలా?
ఉదయం రాజకీయ కార్యక్రమాలకు సమయం కేటాయించినా... రాత్రి వేళల్లో సినిమా చిత్రీకరణలు చేసేలా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. 'వకీల్ సాబ్' చిత్రీకరణ జరిగినప్పుడు సైతం రాజకీయాల పరంగా జనసేనానిది బిజీ షెడ్యూల్. అయితే... మధ్యలో రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుని మరీ ఆ సినిమా పూర్తి చేశారు. అదే విధంగా రాజకీయాల పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ... సినిమాలకు టైమ్ కేటాయించేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట.


Also Read శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?



'బ్రో' తర్వాత 'ఓజీ' వస్తుందా?
జూలై 28న 'బ్రో' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత 'ఓజీ' విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే... ఈ ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు. హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.  'ఓజీ' చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.