దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో వచ్చిన దృశ్య కావ్యం 'బాహుబలి 2' రికార్డులను షారూఖ్ ఖాన్ సినిమా 'పఠాన్' బద్ధలు కొట్టింది. దీనిపై 'బాహుబలి' ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ హర్షం వ్యక్తం చేశారు. 'పఠాన్' తీసిన ప్రొడక్షన్ యశ్ రాజ్ ఫిల్మ్స్ ను, షారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు. యశ్ రాజ్ ఫిలింస్ ''అసలు ఈ స్థాయిలో సినిమాలు తీయొచ్చని నేర్పించిన విజనరీ రాజమౌళికి అభినందనలు'' అని రిప్లై ఇచ్చింది. సోషల్ మీడియాలో వాళ్ళ మధ్య సంభాషణ చాలా హుందాగా ఉంది కదూ! కానీ, ఇక్కడే అసలు గొడవ మొదలైంది.
ఇన్నాళ్లుగా సౌత్ సినిమా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయిన బాలీవుడ్... ఇప్పుడు 'బాహుబలి 2' రికార్డులను 'పఠాన్' బీట్ చేయడంతో కాస్త ఓవర్ చేస్తుందేమో అనిపిస్తోంది. ప్రత్యేకించి కొంత మంది బాలీవుడ్ ఫ్యాన్స్ రాజమౌళి, ప్రభాస్ లను ట్రోల్ చేస్తూ చేస్తున్న ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు పఠాన్ సాధించిన రికార్డులు ఏంటి? 'బాహుబలి 2' స్థానం ఏంటి?
'పఠాన్' సినిమా విడుదలైన 36 రోజుల్లో 1000 కోట్ల మార్కును దాటింది. అందులో కేవలం హిందీ బెల్ట్ నుంచి 530 కోట్ల రూపాయల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు 511 కోట్ల రూపాయలతో ఐదేళ్లుగా హిందీలో నెంబర్ 1 గా ఉన్న 'బాహుబలి 2' రికార్డులు బద్దలయ్యాయి. 'బాహుబలి' రెండో స్థానానికి పడిపోగా షారుఖ్ ఖాన్ పఠాన్ మొదటి ప్లేస్ కు వెళ్లింది. అయితే దీన్ని దేశం మొత్తం మీద బాహుబలి రికార్డులను పఠాన్ బద్ధలు కొట్టిందన్న రేంజ్ లో కొంత మంది బాలీవుడ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ రాజమౌళిని, ప్రభాస్ ను ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. వాస్తవానికి ఇప్పటికీ ఇండియాలో కలెక్షన్ల పరంగా 'బాహుబలి 2'నే నెంబర్ 1. దేశం మొత్తం మీద 1400 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. విడుదలైన పది రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్షన్లు సాదించింది. ఇప్పటికీ ఈ రికార్డు బాహుబలి పేరు మీదే ఉంది.
వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అయితే 'దంగల్' అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. ఆమిర్ ఖాన్ సినిమాకు ఇండియాలో బాహుబలి కంటే తక్కువ వచ్చినా... చైనాలో 500 కోట్ల కలెక్షన్లు రావటంతో 2 వేల కోట్ల రూపాయల కలెక్షన్లతో ఓవరాల్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నెంబర్ 2లో 1800 కోట్ల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్లతో బాహుబలి 2 ఉంది. బాహుబలి 1కి వచ్చిన కలెక్షన్లు కూడా కలిపితే 'దంగల్'ను కూడా దాటేస్తది రాజమౌళి సినిమా. అదీ బాక్సాఫీస్ సామ్రాజ్యంపై బాహుబలి అనే బ్రాండ్ తో రాజమౌళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఆ తర్వాత 'బాహుబలి'తో పోలిస్తే 'ఆర్ఆర్ఆర్' తక్కువ కలెక్షన్లే సాధించినా... ఓవరాల్ గా 1200 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో 'పఠాన్' కంటే ముందే ఉంది. కలెక్షన్ల జాబితాలో 'దంగల్', 'బాహుబలి 2', 'RRR', 'కేజీఎఫ్ 2' వరుసగా నాలుగు ప్లేసుల్లో ఉన్నాయి.
Also Read : ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' - డిఫరెంట్ టైటిల్, లుక్‌తో వస్తున్న నందమూరి వారసుడు
అత్యంత కఠిన పరిస్థితుల్లో 'పఠాన్' విడుదలైంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాధించిన ఈ కలెక్షన్లు చాలా చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇంకా ఆడుతుంది కాబట్టి మరో రెండు వందల కోట్లు సాధించినా RRR, KGF 2 సమం అవడమో? లేదా క్రాస్ చేయటమో? చేస్తుంది తప్ప బాహుబలి రికార్డులకు ఢోకా ఏం లేదు. కానీ హిందీలో సాధించిన దాన్నే ఓవరాల్ రికార్డులను బద్ధలు కొట్టినట్లు ప్రొజెక్ట్ చేస్తూ రాజమౌళినే ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ కు కూడా లేనిపోని తలనొప్పులు తెస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవలో రిప్రజెంట్ చేస్తున్న ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ మీద ట్రోలింగ్ చేస్తే నష్టం ఇండియన్ సినిమాకే అనేది సౌతిండియన్ మూవీ లవర్స్ చెబుతున్న మాట.