ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియా శరణ్ హీరోయిన్ గా నటించగా.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషించారు. అగ్ర హీరోలు ఉపేంద్ర - సుదీప్ తొలిసారి కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా మార్చి 17న ఈ చిత్రాన్ని విడుదల కానుంది. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసారు.
ఇప్పటికే 'కబ్జా' మూవీ టీజర్ కు విశేష స్పందన లభించింది. మదర్ సెంటిమెంట్ తో సహా భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ కలబోసిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ అని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో సినిమా గురించి మరింత డీటెయిలింగ్ గా తెలియజేసింది. ఇండియన్స్ ఒకరినొకరు చంపుకునేలా చేస్తాను అంటూ బ్రిటిషర్ చెప్పే డైలాగ్ తో 1945లో ఈ కథ ప్రారంభమైనట్లు చూపించారు.
బ్రిటీష్ పాలనలో భారతదేశంలో మాఫియా పుట్టుక, వారి ఆగడాలు ఎదుగుదల వంటి వాటి గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొన్ని వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది ఈ స్క్రిప్టును రాసుకున్నారట. ''చరిత్ర ఎప్పుడూ తెగి పడిన తలల కంటే, ఆ తలలను తీసిన చేతులనే పొగుడుతుంది. అలాంటి చెయ్యి సృష్టించిన కథే కబ్జా'' అని ట్రైలర్ లో పేర్కొన్నారు.
బ్రిటీష్ పాలనలో వైమానిక దళాధిపతి అయిన ఉపేంద్ర, అనివార్య పరిస్థితుల కారణంగా అండర్ వరల్డ్ లోకి ఎలా ప్రవేశించాడు?, ఆ తరువాత అండర్ వరల్డ్ ని శాసించే డాన్ గా ఎలా ఎదిగాడు? అండర్ వరల్డ్ ని రూపుమాపడానికి వచ్చిన పోలీసాఫర్ సుదీప్ మరియు ఇతర శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే 'కబ్జా' సినిమా అని అర్థమవుతోంది. అండర్ వరల్డ్ డాన్ గా ఉపేంద్ర.. పోలీస్ గా సుదీప్ ఆకట్టుకున్నారు. ఇద్దరూ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించారు.
'ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాధ్యం' వంటి డైలాగ్స్ బాగున్నాయి. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ట్రైలర్ చూస్తున్నంత సేపూ ప్రతీ ఫ్రేమ్ లోనూ 'కేజీఎఫ్' సినిమా గుర్తు రాకమానదు. బ్లాక్ థీమ్ సెటప్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, గ్రాండియర్.. ఇలా ప్రతీది కెజిఎఫ్ తో పోల్చడానికి అవకాశమిచ్చాయి. కాకపోతే దాన్ని మించి ఏదో చెప్పబోతున్నారనే ఆసక్తిని మేకర్స్ కలిగించగలిగారు.
ఇందులో కన్నడ సీనియర్ హీరో శివన్న (శివ రాజ్ కుమార్) స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. శ్రియా శరణ్ తో పాటుగా మురళీ శర్మ, కోట శ్రీనివాస్, పోసాని కృష్ణ మురళి, సుధ, కబీర్ దుహన్ సింగ్, నవాబ్ షా, దేవ్ గిల్ తదితరులు నటించారు. తాన్య హోప్ ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. KGF ఫేమ్ రవి బసృర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మహేష్ రెడ్డి ఎడిటింగ్ చేసారు.
'కబ్జా' చిత్రాన్ని శ్రీ సిద్దేశ్వర ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ సినిమాస్ బ్యానర్స్ పై ఆర్. చంద్రు భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలంకార్ పాండియన్, ఆర్కా సాయి కృష్ణ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక తెలుగు వెర్షన్ విషయానికొస్తే, టీజర్ లో లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్నట్లు పేర్కొనగా.. ఇప్పుడు ట్రైలర్ లో మాత్రం ఎన్. సుధాకర్ రెడ్డి సమర్పణలో రాబోతున్నట్లు పేర్కొనడం గమనార్హం. కన్నడలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్న 'కబ్జా' మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.