సినిమా రివ్యూ : ఎలోన్ 
రేటింగ్ : 1/5
నటీనటులు : మోహన్ లాల్ 
ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజమ్, ప్రమోద్ కె. పిళ్ళై

  
సంగీతం : 4మ్యూజిక్స్ 
నిర్మాత‌ : ఆంటోనీ పెరంబూర్ 
రచన, ద‌ర్శ‌క‌త్వం : షాజీ కైలాస్  
విడుదల తేదీ : మార్చి 3, 2023
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌


మోహన్ లాల్ (Mohanlal) నటించిన మలయాళ సినిమా 'ఎలోన్' (Alone Movie Telugu). జనవరి 26న మలయాళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. మార్చి 3న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar) ఓటీటీలో విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీలో అనువదించి అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది (Alone Telugu Review)?


కథ (Alone Movie Story) : కరోనా సమయంలో కాళిదాసు (మోహన్ లాల్) కొచ్చికి షిఫ్ట్ అవుతాడు. గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకుని దిగుతాడు. అందులో తల్లీకూతుళ్ళు శ్రీదేవి, అను ఆత్మలు ఉన్నాయని... వాళ్ళిద్దరి మృతిని ఆత్మహత్యలుగా నమోదు చేసి కేసు క్లోజ్ చేసినా, వాళ్ళ మరణాల వెనుక మిస్టరీని తాను కనిపెడతానని రంగంలోకి దిగుతాడు. అసలు, కాళిదాసు ఎవరు? శ్రీదేవి, అను ఎవరు? కాళిదాసు ఎవరెవరికి ఫోనులు చేసేవాడు? చివరికి ఏం చేశాడు? అనేది సినిమా.  


విశ్లేషణ : 'ఎలోన్' స్టార్టింగ్ సీన్స్ చూస్తే ఇదొక హారర్ సినిమా ఏమో అనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి మర్డర్ మిస్టరీగా మారుతున్నట్టు ఉంటుంది. ఎట్ లాస్ట్, ఎండ్ క్రెడిట్స్ దగ్గరకు వచ్చేసరికి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ముగుస్తుంది. 'ఎలోన్' ఒక్క జానర్ సినిమా కాదన్నట్టు... జానర్ షిఫ్ట్ కలరింగ్ ఇచ్చారు. అన్నిటి కంటే పెద్ద ప్రయోగం ఏమిటంటే... ఒక్క నటుడితో సినిమా అంతా నడిపించడం!
 
సినిమాలో ఒక్కరంటే ఒక్కరే యాక్టర్ ఉన్నప్పుడు సన్నివేశాలు గానీ, స్క్రీన్ ప్లే గానీ ఎంత పకడ్బందీగా రాసుకోవాలి? ఎలా రాసుకోకూడదనేది చెప్పడానికి ఎగ్జాంపుల్ అన్నట్టు 'ఎలోన్' తీశారు. మోహన్ లాల్ స్టార్‌డమ్ మీద విపరీతంగా రైటర్ రాజేష్ జయరామన్, డైరెక్టర్ షాజీ కైలాస్ విపరీతంగా ఆధారపడ్డారు. రంగురంగుల టీ షర్టుల్లో మోహన్ లాల్ కనబడుతూ డైలాగ్స్ చెబితే సరిపోతుందని అనుకున్నట్టు ఉన్నారు. సన్నివేశంలో కంటెంట్ ఉండాలనేది మర్చిపోయారు. 'నిజాయితీపరుల రక్తం ఈ భూమిపై చిందితే భూకంపాలు వస్తాయని తెలియదా? ఆ భూకంపాల శబ్దమే నిజాయితీని బయటపడుతుంది' అని ఓ సన్నివేశంలో మోహన్ లాల్ చెబుతారు. సన్నివేశంతో సంబంధం లేని ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందని ఎంత ఆలోచించినా సమాధానం దొరకదు.
 
స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ దశలోనూ ఎగ్జైట్ చేసే సన్నివేశాలు సినిమాలో లేవు. ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప! అప్పటికి సినిమా చూసే ఓపిక నశిస్తుంది. కెమెరా వర్క్ బాగుంది. ఉన్నంతలో ఫ్లాట్ అంతటినీ బాగా చూపించారు. రీ రికార్డింగ్ ఏం చేశారని ఎంత గుర్తు చేసుకున్నా అర్థం కాదు.  
 
నటీనటులు ఎలా చేశారంటే? : మోహన్ లాల్ (Mohanlal Complete Actor) ను కేరళ ప్రేక్షకులు, ఫ్యాన్స్ 'కంప్లీట్ యాక్టర్' అంటుంటారు. సినిమాలో ఆయన తప్ప మరో యాక్టర్ లేరు. రెండు గంటలు కేవలం ఆయన్ను మాత్రమే చూసిన తర్వాత ఏదో 'ఇన్ కంప్లీట్' ఫీలింగ్ కలుగుతుంది. కంప్లీట్ యాక్టర్ కూడా కంటెంట్ లేకపోతే కొన్నిసార్లు బోర్ కొట్టిస్తారని చెప్పడానికి 'ఎలోన్' ఒక ఉదాహరణ. నటుడిగా మోహన్ లాల్ మెరిసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అయితే, వాటిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా నటీనటులు ఎవరూ కనిపించరు. కాకపోతే, గొంతులు మాత్రం వినిపిస్తాయి.


Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : మలయాళంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, మంచి కథలు వస్తాయని పేరు ఉంది. మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి 'ఎలోన్' ఒక ఉదాహరణ. ఇరవై నిమిషాల్లో షార్ట్ ఫిలింగా తీయాల్సిన కంటెంట్ పట్టుకుని రెండు గంటల సినిమా తీశారు. మోహన్ లాల్ ఒక్కరే తెరపై కనిపించేలా... ఒక్క పాత్రతో సినిమా తీయాలనే ఆలోచన బావుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఓకే. ఆ రెండూ తప్ప సినిమాలో సరుకు ఏమీ లేదు.  


Also Read : 'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?