సినిమా రివ్యూ : బలగం
రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రియద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు  
ఛాయాగ్రహణం : ఆచార్య వేణు
పాటలు : కాసర్ల శ్యామ్
సంగీతం :  భీమ్స్ సిసిరోలియో
సమర్పణ : శిరీష్
నిర్మాత‌లు : హర్షిత్ రెడ్డి, హన్షిత
ద‌ర్శ‌క‌త్వం : వేణు యెల్దండి (వేణు టిల్లు) 
విడుదల తేదీ : మార్చి 3, 2023


సినిమాలు, కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు వేణు టిల్లు (Venu Tillu). 'బలగం' సినిమా (Balagam Telugu Movie)తో దర్శకుడిగా మారారు. 'దిల్' రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగా ప్రీమియర్ షోలు వేశారు. మరి, 'బలగం' (Balagam Review In Telugu) ఎలా ఉంది?


కథ (Balagam Movie Story) : సాయిలు (ప్రియదర్శి) పెళ్ళికి రెడీ అవుతాడు. రెండు రోజుల్లో వరపూజ (నిశ్చితార్థం) అనగా... తాతయ్య (సుధాకర్ రెడ్డి) మరణిస్తాడు. వరపూజ రోజున పది లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామని అనుకున్న అతని ప్లాన్ బెడిసి కొడుతుంది. చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. తాతయ్య భౌతిక కాయం చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్) ను చూస్తాడు. మావయ్యకు బోలెడు ఆస్తి ఉందని తెలుస్తుంది. సంధ్యను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుంటే అప్పు తీరుతుందని ప్లాన్ వేస్తాడు. అయితే... సాయిలు తండ్రి (జయరాం)కి, మావయ్య (మురళీధర్)కు మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి? కాకి ఎందుకు ముద్ద (మరణించిన వ్యక్తులకు పెట్టే భోజనం) ముట్టలేదు? తాతయ్య ఆత్మ కోరుకున్నది ఏమిటి? అందుకోసం గొడవల్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు ఏం చేశారు? అనేది సినిమా. 


విశ్లేషణ : భావోద్వేగానికి భాష, యాస ఎప్పుడూ అడ్డం కావు. కొన్నిసార్లు నటీనటుల మాట్లాడే భాష ప్రేక్షకులకు అర్థం కాకున్నా... చప్పట్లు కొట్టారంటే కారణం ఆయా సినిమాల్లో భావోద్వేగమే. 'బలగం' చిత్రానికి పని చేసిన బృందమంతా తెలంగాణ బిడ్డలే. సినిమాలోనూ తెలంగాణ యాస వినిపిస్తుంది. భావోద్వేగాలు మాత్రం మనుషులు అందరి హృదయాలు తాకే విధంగా ఉన్నాయి.


'బలగం' బలం అంతా భావోద్వేగాల్లో, కాసర్ల శ్యామ్ సాహిత్యం & భీమ్స్ సంగీతంలో ఉంది. భావోద్వేగం అంటే కంటతడి మాత్రమే కాదు, నవ్వడం కూడా! అటువంటి భావోద్వేగాలను పట్టుకోవడంలో వేణు యెల్దండి సక్సెస్ అయ్యారు. చావు ఇంట్లో, మరణించిన మనిషి ముందు కొందరి ప్రవర్తన నవ్విస్తుంది. ఆ సన్నివేశాలను చక్కగా రాసుకున్నారు. ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. కొత్త ఎమోషన్స్ చూపించలేదు. కానీ, కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. 


అన్నాచెల్లెళ్ళ మధ్య బాండింగ్ చెప్పే సీన్, పొలం దగ్గర తాతయ్యకు ఇష్టమైన ప్రదేశంలో ప్రియదర్శి ఎమోషనల్ అయ్యే సీన్, ప్రింటింగ్ ప్రెస్‌లో హీరోయిన్ సీన్... చెబుతూ వెళితే ఇటువంటి కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. 


విడి విడిగా చూస్తే కొత్త సీన్లు ఏమున్నాయి? అనిపిస్తుంది. కాకి ముద్ద ముట్టడం, హీరో తండ్రి & మావయ్య మధ్య గొడవ చుట్టూ ఎక్కువ సేపు కథ తిరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత, ముందు కొంత నెమ్మదిస్తుంది. అయితే, సినిమా అంతటినీ ఒక్కటిగా చూస్తే ఒక ఎమోషన్ క్యారీ అయ్యింది. అందుకు ముఖ్య కారణం సంగీతం, సాహిత్యమే. తాతయ్య మనసులో బాధను ఇంకా బలంగా ఆవిష్కరించి ఉండుంటే బావుండేది. అప్పుడు ఇంకా డెప్త్ ఎక్కువ ఉండేది. 


తెలంగాణ పల్లె వాతావరణాన్ని, సంస్కృతిని ఆవిష్కరించే విధంగా కాసర్ల శ్యామ్ పాటలు రాశారు. భీమ్స్ సంగీతం అందించారు. 'ఊరు పల్లెటూరు...' పాట ఇంకా  కొన్నాళ్ళు వినబడుతుంది. ఆచార్య వేణు సినెమాటోగ్రఫీ బావుంది. సంభాషణల్లో తెలంగాణ యాస, ఆ సహజత్వం బావున్నాయి. 


నటీనటులు ఎలా చేశారంటే? : 'బలగం'లో నటీనటులు కనిపించలేదు. క్యారెక్టర్లు మాత్రమే కనిపించాయి. ప్రతి ఒక్కరూ జీవించారు. ప్రియదర్శి హీరోగా చేయలేదు. కథలో పాత్రగా కనిపించారు. కావ్యా కళ్యాణ్ రామ్ లుక్స్ బావున్నాయి. ఎమోషన్స్ కూడా బాగా క్యారీ చేశారు. తాతయ్య క్యారెక్టర్ చేసిన పెద్దాయన సుధాకర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించాలి. కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినప్పటికీ కథపై ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ తమ తమ పాత్రలకు ప్రాణం పోశారు. నటుడిగా, దర్శకుడిగా మాత్రమే కాదు... పతాక సన్నివేశాల్లో గాయకుడిగా కూడా  వేణు రాణించారు. ఆ సన్నివేశాలకు గొంతుతో ప్రాణం పోశారు. సినిమాలో వేణు టిల్లు చేసిన క్యారెక్టర్ బావుంది.  


Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?


చివరగా చెప్పేది ఏంటంటే? : తెలంగాణ యాస, భాష, సంస్కృతికి పట్టం కట్టిన సినిమాల్లో 'బలగం' ఒక్కటిగా నిలుస్తుంది. యాసను మించిన ఎమోషన్ సినిమాలో ఉంది. మనుషులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళను ప్రేమగా చూసుకోమనే సందేశం ఇస్తుంది. ఇది తెలంగాణ మట్టిలో కథ, మనుషుల కథ, మనల్ని మనకు తెరపై చూపించే కథ. నటీనటుల ప్రతిభ, వేణు దర్శకత్వం, భీమ్స్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం... వెరసి 'బలగం' చిత్రంలో భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించాయి. తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. 


Also Read : 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?