సినిమా రివ్యూ : వినరో భాగ్యము విష్ణు కథ
రేటింగ్ : 2.25/5
నటీనటులు : కిరణ్ అబ్బవరం, క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ, 'కె.జి.యఫ్' లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు  
ఛాయాగ్రహణం : డేనియల్ విశ్వాస్
సంగీతం : చైతన్ భరద్వాజ్
సమర్పణ : అల్లు అరవింద్ 
నిర్మాత‌ : 'బన్నీ' వాస్
ద‌ర్శ‌క‌త్వం : మురళీ కిషోర్ అబ్బూరు 
విడుదల తేదీ: ఫిబ్రవరి 18, 2023


'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చిత్రాలతో ప్రేక్షకులలో, చిత్ర పరిశ్రమలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆయనకు విజయాలు ఇవ్వలేదు. మహాశివరాత్రి సందర్భంగా జీఏ 2 పిక్చర్స్ సంస్థలో 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie) చేశారు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటి? అంటే... 


కథ (VBVK Movie Story) : దర్శనా (కశ్మీరా ప‌ర్ధేశీ) యూట్యూబర్. ఎన్ని వీడియోలు చేసినా వ్యూస్ మాత్రం రావు. ఫేమస్ కావడం కోసం నెంబర్ నైబర్స్ (ఫోన్ నంబర్‌కు ఒక అంకె ముందు, వెనుక)కి ఫోన్ చేసి వాళ్ళతో వీడియో ప్లాన్ చేస్తుంది. దర్శనా ఫోన్ నెంబర్ నైబర్స్ ఎవరంటే... ఒకరు, శర్మ (మురళీ శర్మ). ఆయనకు పెట్స్ క్లినిక్ ఉంటుంది. ఇంకొకరు, విష్ణు (కిరణ్ అబ్బవరం). ఇతరులకు సహాయం చేయడం అతని గుణం. ముగ్గురు కలిసి వీడియోలు చేస్తారు. ఈ క్రమంలో దర్శనతో విష్ణు ప్రేమలో పడతాడు. శర్మ కూడా దర్శనను ప్రేమిస్తాడు. అతనితోనూ సన్నిహితంగా ఉంటూ వస్తుంది. అయితే, ఒక రోజు శర్మను షూట్ చేస్తుంది. అతను మరణిస్తాడు. శర్మను దర్శనా చంపడానికి కారణం ఏంటి? విష్ణు కోసం ఎన్ఐఏ & రాయలసీమకు చెందిన ఓ మంత్రి ('కె.జి.యఫ్' లక్కీ) ఎందుకు తిరుగుతున్నారు? శర్మ హత్య కేసులో జైలుకు వెళ్ళిన దర్శనను బయటకు తీసుకు రావడం కోసం విష్ణు ఏం చేశాడు? ముంబై గ్యాంగ్ స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? అనేది మిగతా సినిమా.  


విశ్లేషణ : కిరణ్ అబ్బవరం మంచి కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తారు. ఓ చిన్న పాయింట్ పట్టుకుని కథ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఆయన కొన్ని తప్పటడుగులు వేస్తున్నారు. అందువల్ల, సాలిడ్ హిట్ పడటం లేదు. మరి, ఈసారైనా ఆయనకు హిట్ వచ్చిందా? లేదా? అనేది ఒక్కసారి చూస్తే...


'వినరో భాగ్యము విష్ణు కథ' టైటిల్ కొంచెం పెద్దగా ఉంది. కానీ, కథ అంత పెద్దది ఏమీ కాదు. చాలా అంటే చాలా సింపుల్! ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఉన్న మంచి కుర్రాడు, తన ప్రేయసి కోసం ఏం చేశాడు? అనేది పైకి కనిపించే కథ. దీని వెనుక మరొక కథ ఉందనుకోండి. క్లైమాక్స్ వరకు అది తెలియదు. అందువల్ల దాన్ని పక్కన పెట్టి, అప్పటి వరకు చెప్పిన కథకు వస్తే... ఈ కథను రెండు రకాలుగా తీయవచ్చు. ఒకటి, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా! రెండు, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ టైపులో! 


దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి, హీరో కిరణ్ అబ్బవరం అండ్ కో రెండు దారుల్లో ఏదో ఒక దారిని ఎంచుకోలేదు. విశ్రాంతి వరకు ప్రేమకథలా తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత చిన్న ట్విస్ట్ ఇచ్చారు. విశ్రాంతి అయ్యాక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ జానర్‌కు షిఫ్ట్ అయ్యారా? అంటే అదీ చేయలేదు. రెగ్యులర్ ఫార్మటులో వెళ్ళి వెళ్ళి పతాక సన్నివేశాల్లో ఒక్కసారిగా జానర్ షిఫ్ట్ చేశారు. అయితే... సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే? ఎంత సేపటికి కథ ముందుకు కదలదు. కమర్షియల్ ప్యాకేజీలో కథను చెప్పే విషయంలో తడబడ్డారు. అసలు ట్విస్ట్ రివీల్ అయ్యాక మరీ కామెడీ చేశారని అనిపిస్తుంది.


సాయం చేసే మంచి మనసున్న వ్యక్తిగా హీరోను పరిచయం చేశారు. ఆ తర్వాత విశ్రాంతి వరకు అసలు కథలోకి వెళితే ఒట్టు. మధ్యలో పాటలు, కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ నిదానంగా ముందుకు వెళ్ళి చివర్లో అసలు కథ చెప్పారు. మధ్య మధ్యలో కొన్ని మంచి డైలాగులు ఉన్నాయి. అయితే, అవి వాట్సాప్ కొటేషన్స్ తరహాలో ఉన్నాయి. కంటెంట్‌తో సంబంధం లేకుండా భారీ డైలాగులు హీరోతో చెప్పించారు. కిరణ్ అబ్బవరాన్ని మాస్ హీరో చేసే ప్రయత్నం ఈ సినిమాలో కూడా కనపడింది. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు. 


'వినరో భాగ్యము విష్ణు కథ'లో కథ, కథనం, సన్నివేశాల కంటే చైతన్ భరద్వాజ్ సంగీతం మనల్ని ఎక్కువ ఆకట్టుకుంటుంది. వందశాతం ఎఫర్ట్స్ పెట్టి మంచి మ్యూజిక్ అందించారు. 'వాసవ సుహాస...' సాంగ్ వినసొంపుగా ఉంది. మిగతా పాటలు, నేపథ్య సంగీతం కూడా బావున్నాయి. సాహిత్యం కూడా బావుంది. తిరుపతిని చక్కగా చూపించారు. కెమెరా వర్క్ నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.  


నటీనటులు ఎలా చేశారంటే? : కిరణ్ అబ్బవరం కొత్తగా నటించలేదు. ఇంతకు ముందు సినిమాల్లో చేసినట్లు చేశారు. అయితే, పక్కింటి కుర్రాడి పాత్రలో చాలా చక్కగా ఉన్నారు. డ్యాన్స్ విషయంలో ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు కూడా! హీరోయిన్ కశ్మీర గ్లామర్ డాల్ అంతే! ఆమె నుంచి నటన ఆశించడం అత్యాశే. మురళీ శర్మను దర్శకుడు బాగా వాడుకున్నారు. కశ్మీరాతో ఆయన చేత స్టెప్పులు వేయించారు. కొంచెం రొమాంటిక్ కామెడీ సీన్స్ చేయించారు. కథలో ట్విస్టులకు మురళీ శర్మ లాంటి నటుడు ఉండటం సినిమాకు హెల్ప్ అయ్యింది. 'కె.జి.యఫ్' లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్... సినిమాలో భారీ తారాగణం ఉంది. పాత్రల పరిధి మేరకు చేశారంతా! 


Also Read : 'సార్' రివ్యూ : ధనుష్ పాఠాలు బోర్ కొట్టించాయా? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా?


చివరగా చెప్పేది ఏంటంటే? : కిరణ్ అబ్బవరం గత సినిమాతో పోలిస్తే 'వినరో భాగ్యము విష్ణు కథ' బెటర్ ఫిల్మ్. కాన్సెప్ట్ పరంగా ఓకే. కానీ, హ్యాండిల్ చేయడంలో కొత్త దర్శకుడు పూర్తిగా సక్సెస్ కాలేదు. మ్యూజిక్ కొంత వరకు సినిమాను మోసింది. కథ, డైలాగులు, సన్నివేశాలతో సంబంధం లేకుండా మంచి పాటలతో కూడిన కమర్షియల్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులను శాటిస్‌ఫై చేస్తుంది. 


Also Read : యాంట్‌ మ్యాన్ మూడో సినిమా ఎలా ఉంది? కొత్త సూపర్ విలన్ ఆకట్టుకున్నాడా?