సినిమా రివ్యూ : యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటమేనియా
రేటింగ్ : 2.5/5
నటీనటులు : పాల్ రడ్, ఎవాంజెలిన్ లిల్లీ, కేథరిన్ న్యూటన్, జొనాథన్ మేయర్స్, మైకేల్ డగ్లస్, మిషెల్ ఫైఫర్ తదితరులు
ఛాయాగ్రహణం : విలియం పోప్
సంగీతం : జీన్ క్రిస్టోఫీ బెక్
నిర్మాణం : మార్వెల్ స్టూడియోస్
రచన : జెఫ్ లవ్‌నెస్
ద‌ర్శ‌క‌త్వం : పీటన్ రీడ్
విడుదల తేదీ: ఫిబ్రవరి 17, 2023


సినిమాటిక్ యూనివర్స్, మల్టీవర్స్, ఫ్రాంచైజీ సినిమా... ప్రస్తుతం మనదేశంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు ఇవే. వీటన్నిటికీ పురుడు పోసింది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఏకంగా 15 సంవత్సరాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా ఒకే కథను కొనసాగిస్తూ సినిమాలు తీస్తూనే ఉంది మార్వెల్. అయితే గత కొంతకాలంగా మార్వెల్‌కు కాలం కలిసి రాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ఫేజ్-5లో మొదటి సినిమా ‘యాంట్ మ్యాన్ అంట్ ది వాస్ప్: క్వాంటమేనియా (Ant Man And The Wasp: Quantumania)’. తర్వాత వచ్చే అవెంజర్స్ సినిమా ‘అవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ (Avengers: The Kang Dynasty)’లో మెయిన్ విలన్ అయిన కాంగ్‌ను ఇందులోనే పరిచయం చేయనుండటంతో దీనిపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ బుల్లి సూపర్ హీరో అందుకున్నాడా?


కథ: గజ దొంగ అయిన స్కాట్ లాంగ్ (పాల్ రడ్) తర్వాత సూపర్ హీరోగా, అవెంజర్‌గా ఎలా మారాడో దీనికి ముందు భాగాల్లో చూశాం. ఇప్పుడు స్కాట్ శాన్‌ఫ్రాన్సిస్కోలో సెలబ్రిటీ హోదాలో బతుకుతూ ఉంటాడు. తన కూతురు కేసీని (కేథరిన్ న్యూటన్) తిరిగి కలుస్తాడు. ప్రేమించిన అమ్మాయి హోప్ వాన్ డైన్‌తో (ఎవాంజెలిన్ లిల్లీ) బంధం మరింత బలపడుతుంది. హోప్ తల్లిదండ్రులు హ్యాంక్ పిమ్ (మైకేల్ డగ్లస్), జానెట్ వాన్ డైన్ (మిషెల్ ఫైఫర్)లకు కూడా స్కాట్ నచ్చుతాడు. అయితే కేసీ కొత్త పరిశోధన కారణంగా వీరందరూ క్వాంటం రెల్మ్‌లో చిక్కుకుపోతారు. అందులో వాళ్లు కాంగ్: ది కాంకరర్ (జొనాథన్ మేజర్స్) (Kang: The Conquerer) బారిన పడతారు. వీరి లాగానే అతను కూడా బయట ప్రపంచంలోకి రావాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ అతను బయటకు వచ్చాడంటే విశ్వం మొత్తం అంతం అవుతుంది. ఇంతకు ముందు కూడా కాంగ్ ఎన్నో ప్రపంచాలను నాశనం చేసి ఉంటాడు. మరి కాంగ్‌ను యాంట్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? తిరిగి ఈ ప్రపంచంలోకి తిరిగి వచ్చాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


విశ్లేషణ: కాంగ్... కాంగ్... కాంగ్... ఈ సినిమా మొత్తం చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇందులో ప్లస్ పాయింట్స్ ఏవి అని ఆలోచించినప్పుడు మనకు మొదట గుర్తొచ్చేది కాంగ్ పాత్రే. మరో మూడు, నాలుగు సంవత్సరాలు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ను నడిపించే విలన్ పాత్ర ఇదే కాబట్టి ఈ పాత్రకు సినిమాలో మంచి వెయిట్ ఇచ్చారు. కానీ అదే కాన్సన్‌ట్రేషన్ రైటింగ్ మీద, యాంట్ మ్యాన్ పాత్ర మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది.


నిజానికి పేరుకు ఈ సినిమాలో హీరో యాంట్ మ్యాన్ అయినా కథ ప్రధానంగా కాంగ్, జానెట్ పాత్రల చుట్టే తిరుగుతుంది. జానెట్‌కు క్వాంటం రెల్మ్‌లో 30 సంవత్సరాలు గడిపిన అనుభవం ఉంది. దీంతో అక్కడ స్కాట్‌కు ఏ అవసరం వచ్చినా జానెట్ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. ఒక్కసారి కాంగ్ ఎంట్రీ ఇచ్చాక మొత్తం పాత్రలన్నీ సైడ్ అయిపోతాయి. దీంతో క్లాసిక్ యాంట్ మ్యాన్ ఫ్యాన్స్ కొంత నిరాశ పడతారు. అయితే వీఎఫ్ఎక్స్ మాత్రం అద్బుతం. విజువల్ వండర్స్ అనిపించే సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ సినిమా అంటే కేవలం విజువల్‌గానే కాకుండా కథ పరంగా కూడా ఎంగేజ్ చేయాలి కదా. అక్కడ ఈ చీమ మనిషి వెనకబడతాడు.


హార్డ్ కోర్ మార్వెల్ ఫ్యాన్స్‌ను కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే శాటిస్‌ఫై చేయగలదు. ఇక సూపర్ హీరో సినిమాల ఫ్యాన్స్ మరోసారి నిరాశ పడక తప్పదు. గత యాంట్ మ్యాన్ సినిమాల్లో కనిపించే కామెడీ ఇందులో తగ్గిపోయింది. అలాగే స్కాట్ లాంగ్, అతని కూతురు కేసీల మధ్య ఎమోషన్‌ను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు కూడా అస్సలు లేవు. కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5కు మంచి విలన్‌ను ఇందులో పరిచయం చేశారు. తర్వాతి భాగాల్లో ఎలా వాడుకుంటారో తెలీదు కానీ... అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, దానికి ముందు సినిమాల్లో థానోస్‌ రూపంలో ఎంత బలమైన పాత్ర పడిందో అంతకంటే బలంగా కాంగ్ పాత్ర తెరమీద కనిపిస్తుంది. గత మార్వెల్ సినిమాల్లో కనిపించిన మరో సూపర్ హీరో/విలన్‌కు కూడా ఇందులో సర్‌ప్రైజ్ ఎంట్రీ ఉంది. ఇక్కడ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి దాని గురించి ఏమీ వివరించట్లేదు.


సినిమా నిడివి రెండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే కావడం పెద్ద ప్లస్ పాయింట్. జీన్ క్రిస్టోఫీ బెక్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కాంగ్ కనిపించే సన్నివేశాలను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత హైలెట్ చేసింది. విలియం పోప్ తన సినిమాటోగ్రఫీతో విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... పాల్ రడ్ ఇప్పటికే యాంట్ మ్యాన్ పాత్రను అరడజను సార్లకు పైగా పోషించాడు. ఈ క్యారెక్టర్‌కు ఏం కావాలో తనకు పర్పెక్ట్‌గా తెలుసు. ఆ మేరకు న్యాయం చేశాడు. ఇక కాంగ్ పాత్రలో కనిపించిన జొనాథన్ మేయర్స్ ఈ సినిమాకే హైలెట్. ఇప్పటికే ‘లోకి‘ సిరీస్‌లో ‘హి హూ రిమైన్స్ (He Who Remains)’ పాత్రలో జొనాథన్ కనిపించాడు. కానీ ఆ పాత్రకు, ‘కాంగ్’కు అస్సలు సంబంధం ఉండదు. ‘హి హూ రిమైన్స్’ పాత్ర ప్రకృతి అయితే, కాంగ్ ప్రళయం. ఆ వేరియేషన్‌ను జొనాథన్ అద్భుతంగా పోషించాడు. జానెట్ పాత్రలో మిషెల్ ఫైఫర్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులందరూ వారి పరిధుల మేరకు నటించారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఈ సినిమా పేరు యాంట్‌మ్యాన్‌దే. కానీ కథ మాత్రం కాంగ్‌ది.’ మార్వెల్ సినిమాలు మొదటి నుంచి ఫాలో అవుతూ, కథ కంటిన్యుటీ మిస్సవ్వకూడదు అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూడవచ్చు. మిగతా వారికి కష్టమే.