సినిమా రివ్యూ : సార్
రేటింగ్ : 2.75/5
నటీనటులు : ధనుష్, సంయుక్తా మీనన్, సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, 'హైపర్' ఆది, 'ఆడుకాలమ్' నరేన్, మొట్ట రాజేందర్, హరీష్ పేరడీ, పమ్మి సాయి తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో సుమంత్
ఛాయాగ్రహణం : జె. యువరాజ్ 
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత‌లు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, ద‌ర్శ‌క‌త్వం : వెంకీ అట్లూరి 
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2023


ధనుష్ (Dhanush) కథానాయకుడిగా నటించిన సినిమా 'సార్' (తమిళంలో 'వాతి'). వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' తర్వాత ఆయన తీసిన చిత్రమిది. విద్యావ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది (SIR Movie Review In Telugu)? 


కథ (Sir Movie Story) : విద్య వ్యాపారంగా మారడంతో ప్రభుత్వ కళాశాలలు మూత పడుతున్న రోజులు అవి. బాలు అలియాస్ బాలగంగాధర్ తిలక్ (ధనుష్) ఓ డ్రైవర్ కొడుకు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు సిరిపురంలో ప్రభుత్వ కళాశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? పనికి వెళ్ళే పిల్లలను కాలేజీకి వచ్చేలా చేసి మరీ పాఠాలు ఎందుకు చెప్పాడు? బాలు సార్ చదువు చెప్పిన విద్యార్థులు అందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాసులో పాస్ కావడంతో ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడైన త్రిపాఠి (సముద్రఖని) ఏం చేశాడు? బాలు ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అతని ప్రయాణంలో మీనాక్షి (సంయుక్తా మీనన్) పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ : 'సార్' గురించి చెప్పాలంటే... విశ్రాంతికి ముందు, తర్వాత అని చెప్పాలి. ఎందుకంటే... ఇంటర్వెల్ వరకు మనసుల్ని కదిలించే సన్నివేశాలు గానీ, పెద్దగా కథ గానీ జరగలేదు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, హీరో క్యారెక్టర్ పరిచయం, తర్వాత హీరోయిన్ పరిచయం, రొమాంటిక్ సాంగ్, మధ్యలో రెండు మూడు కామెడీ సీన్స్ - ఈ విధంగా కమర్షియల్ కొలతల్లో సాగింది. పైగా తెరపై వచ్చే సన్నివేశాలు కొన్ని కృత్రిమంగా అనిపిస్తాయి. మనసును తాకే విధంగా లేవు.


విశ్రాంతి తర్వాతే అసలు సినిమా మొదలైంది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు మనసును తాకుతుంది. హృదయంతో చూసేలా చేస్తుంది. ఆ ఫైటులో, భావోద్వేగభరిత సన్నివేశాల్లో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం కూడా అద్భుతం. కంటెంట్ కంటే అక్కడ నటన, నేపథ్య సంగీతం సన్నివేశాన్ని నిలబెట్టాయి. ధనుష్ చెప్పినట్టు... 'సార్' కథ సింపులే. భావోద్వేగాలు బలంగా ఉన్నాయి. (Vaathi Review)


'సార్' కథలో కొన్ని లోటుపాట్లు కనబడతాయి. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి పాయింట్ చెప్పాలనుకున్నారు. ఇంటర్వెల్ తర్వాత కొన్ని మంచి సీన్లు కూడా రాసుకున్నారు. అయితే, ఇంటర్వెల్ ముందు సోసోగా నడిపించారు. పాయింట్ కొత్తది కాదు. 'జెంటిల్‌మన్'లో శంకర్ టచ్ చేసినదే. లవ్ ట్రాక్ కథలో సరిగా ఇమడలేదు. ముఖ్యంగా కథపై హృతిక్ రోషన్ 'సూపర్ 30' ప్రభావం కనబడుతుంది. పతాక సన్నివేశం ఆమిర్ ఖాన్ '3 ఇడియట్స్' ఎండింగును గుర్తు చేస్తుంది. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కమర్షియల్ గ్రాఫ్ లో వెళ్ళింది. ట్విస్టలు ఏమీ లేవు. తర్వాత ఏం జరుగుతుందో ముందుగా ఊహించవచ్చు.  


'సార్'లో మనమంతా రోజువారీ మాట్లాడుకునే సంభాషణలు వినిపిస్తాయి. అయితే, అవసరం అయిన చోటు 'అవసరానికి కులం ఉండదు', 'విద్య అనేది గుడిలో నైవేద్యం లాంటిది. దాన్ని పంచి పెట్టండి. అమ్మకండి' వంటి మంచి డైలాగులు పడ్డాయి. అప్పుడు విజిల్ వేసి, క్లాప్స్ కొట్టాలని అనిపిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బావుంది. 'మాష్టారు మాష్టారు...' విడుదలకు ముందు చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమాలో కూడా బావుంది. నిర్మాణ విలువలు ఓకే. తెలుగు, తమిళ సినిమా కావడంతో... కొన్ని సన్నివేశాలను తమిళంలో తీసి తెలుగులోకి అనువదించిన ఫీలింగ్ కలుగుతుంది. 


నటీనటులు ఎలా చేశారంటే? : బాలు పాత్రలో ధనుష్ జీవించారు. ఆయన నటన కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని ఫీలయ్యేలా చేసింది. ఎమోషనల్ సీన్స్, ఫైట్స్ బాగా చేశారు. మీనాక్షిగా సంయుక్తా మీనన్ బదులు మరొక కథానాయిక అయితే బావుండేదేమో!? కొన్ని సన్నివేశాల్లో బొమ్మలా నిలబడింది తప్ప ఎక్స్‌ప్రెషన్స్ సరిగా ఇవ్వలేదు. ఆమెది టెంప్లేట్ యాక్టింగ్! సముద్రఖని, సాయి కుమార్ పాత్రలు రొటీనే. కానీ, తమకు ఉన్న అనుభవంతో చక్కగా చేశారు. 'హైపర్' ఆది రెండు మూడు సన్నివేశాల్లో నవ్వించారు. మిగతా నటీనటులు ఓకే. తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ప్రత్యేక పాత్రలో సుమంత్ కనిపించడం విశేషం. ఆయన మాటల్లో కథ మొదలై, ముగుస్తుంది. 


Also Read : 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?


చివరగా చెప్పేది ఏంటంటే? : ధనుష్ నటనకు ఫస్ట్ క్లాస్ మార్కులు పడతాయి. ఆ ఇంటర్వెల్ తర్వాత భావోద్వేగభరిత సన్నివేశానికి వందకు వంద వేయొచ్చు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం డిస్టింక్షనే. కథగా, సినిమాగా చూస్తే 'సార్'కు ఫస్ట్ క్లాస్ మార్క్స్ వేయడం కష్టమే. సంథింగ్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. విద్యను వ్యాపారం చేయడం అనేది ఈతరానికీ కనెక్ట్ అయ్యే పాయింటే. అయితే... ఆ పాయింట్ చెప్పిన తీరు, ఇచ్చిన సందేశం కంటే ధనుష్ నటన, సంగీతం బావున్నాయి.  


Also Read : 'పాప్ కార్న్' రివ్యూ : ప్రేమ కథకు డైపర్ వేశారుగా - అవికా గోర్ సినిమా ఎలా ఉందంటే?