మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మితా సేన్ ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు ఆపరేషన్ చేసి స్టెంట్ వేశారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ వీడియో షేర్ చేశారు. గుండెపోటు ఎలా వచ్చింది? డాక్టర్లు ఎలాంటి చికిత్స చేశారు? అనే విషయాల గురించి ప్రస్తావించారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రేయోభిలాషులకు, త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులతకు ధన్యవాదాలు చెప్పారు.
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా
“నేను ఇటీవల తీవ్రమైన గుండె పోటుకు గురయ్యాను. ప్రధాన రక్తనాళం చాలా వరకు మూసుకుపోయింది. సకాలంలో డాక్టర్లు ట్రీట్మెంట్ అందించడంతో నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, శ్రేయోభిలాషులు తనపై కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. అత్యంత సంక్లిష్ట సమయంలో నా బాగుకోసం కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా మాట్లాడ్డానికి సరిగా గొంతు సహకరించడం లేదు. అయినా, మీ అందరికీ ధన్యాదాలు చెప్పేందుకు ఈ వీడియో చేస్తున్నాను. నా వాయిస్ విని ఇంకా కోలుకోలేదు అనుకోకండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. వాస్తవానికి కొంత కాలం నుంచి చాలా మంది అనేక ఆరోగ్య సంబంధ ఇబ్బందులు పడుతున్నారు. వారిపైనా ప్రేమ, ఆదరణ కనబర్చండి” అని సుస్మితా తెలిపారు.
ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది
“నాకు తాజాగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ముఖ్యమైన రక్తనాళం 95 శాతం క్లోజ్ అయ్యింది. మాసివ్ గుండెపోటుతో ముంబై నానావతి హాస్పిటల్లో చేరాను. అక్కడ నాకు చక్కటి చికిత్స లభించింది. హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్ నా కోసం ఎంతో కష్టపడ్డారు. పెద్ద ప్రమాదం నుంచి నన్ను బయట పడేశారు. నా కుటుంబ సభ్యులకు, దగ్గరి మిత్రులకు ఈ విషయం తెలుసు. కానీ, ఎవరికీ చెప్పకూడదనుకున్నాం. పూర్తిగా కోలుకున్న తర్వాత విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పాను. త్వరగా కోలుకోవాలని చాలా మంది కామెంట్స్ పెట్టారు. నా మీద ప్రేమను చూపించిన వారందరికీ ధన్యవాదాలు” అని చెప్పారు.
త్వరలో షూటింగ్ లో పాల్గొంటా
ఇక ప్రస్తుతం సుస్మితా సేన్ ‘ఆర్య’లో నటిస్తున్నారు. గుండె పోటు కారణంగా కొంత కాలం షూటింగ్ కు దూరం అయ్యారు. “ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉనాను. వారి నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత జైపూర్ కు వెళ్తాను. ఈ సినిమా ద్వారా అందరినీ అలరిస్తాను. అటు ‘తాళీ’ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేస్తాను” అని వెల్లడించారు.
ఇక మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న సుస్మిత, ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఎన్నో చక్కటి సినిమాల్లో నటించింది. ‘నాయక్’, ‘సమయ్’, ‘వాస్తు శాస్త్ర’, ‘పైసా వసూల్’, ‘అలగ్’, ‘నో ప్రొబ్లమ్’ సహా పలు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. 2020లో వచ్చిన ‘ఆర్య’ సిరీస్ తో మరోసారి వెండితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది.
Read Also: మాయాబజార్ To ఆర్ఆర్ఆర్ - వసూళ్లే కాదు, వీక్షకులూ ఎక్కువే - ఏయే మూవీని ఎంతమంది చూశారంటే..