డబ్బింగ్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ ఏర్పరచుకున్న తమిళ హీరోలలో ధనుష్ ఒకరు. ఇటీవల 'సార్' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీ చేసి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రాన్ని తమిళంలో 'వాతి' అనే పేరుతో విడుదల చేశారు. అయితే ఈ సినిమా తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు.
'సార్' చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా, ఫిబ్రవరి 17న భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి సందేశంతో రూపొందిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి 3 రోజుల్లోనే 50 కోట్లు.. ఫస్ట్ వీక్ లో 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి, ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు వంద కోట్ల మార్క్ కు రీచ్ అయ్యింది. దీంతో తెలుగులో ఎంట్రీతోనే వంద కోట్లతో అదరగొట్టిన హీరోగా నిలిచాడు.
'సార్' మూవీ తెలుగు, తమిళ భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ గా 100 కోట్లు రాబట్టినట్లు, చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ధనుష్ సైతం కలెక్షన్స్ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గత చిత్రం 'తిరు' కూడా లాంగ్ రన్ లో 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ధనుష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తచూపుతూ, చదువు ప్రాధాన్యత తెలియజెప్పే కథాంశంతో 'సార్' మూవీ తెరకెక్కింది. మెసేజ్ తో పాటుగా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ధనుష్ ఎప్పటిలాగే రెండు పాత్రల్లో అధ్బుతమైన నటన కనబరిచారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఆకట్టుకుంది.
సముద్రఖని - సాయి కుమార్ - తనికెళ్ళ భరణి - ఆడుకాలమ్ నరేన్ - హరీష్ పేరడీ - తోటపల్లి మధు - పమ్మి సాయి తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
'సార్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఇకపోతే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటీవలే సినిమా చూసి, టీమ్ మొత్తాన్ని అభినందించారు. అలానే ధనుష్ 'సార్' మూవీని స్కూల్ పిల్లలకు ఉచితంగా చూపించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ధర్నా చేసారు. దీనిపై తాజాగా నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ చదువు విలువను తెలియజెప్పేందుకే ఈ సినిమా తీశామని.. స్కూల్ పిల్లలకు ఫ్రీగా మూవీని చూపించడానికి సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. త్వరలోనే స్పెషల్ షో వేయనున్నట్లు వెల్లడించారు.