న్యూమరాలజీ (Numerology) నమ్మే ప్రజలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కొందరికి 'తొమ్మిది' (9) లక్కీ నంబర్ అంటుంటారు. అయితే, నందమూరి తారక రత్న (Taraka Ratna) కు మాత్రం ఆ సంఖ్య కలిసి రాలేదనే అభిప్రాయం చిత్ర పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అందుకు బలమైన కారణాలు ఉన్నాయి. 


తొమ్మిది సినిమాలు ప్రారంభమైనా...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తారక రత్న అరంగేట్రం చాలా ఘనంగా జరిగింది. ఒక్క రోజే తొమ్మిది సినిమాలకు ఆయన క్లాప్ కొట్టారు. ఒకే రోజు తొమ్మిది సినిమాలు స్టార్ట్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఆ తొమ్మిది సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినవి నాలుగు ఐదు మాత్రమే. అప్పట్లో ఓపెనింగ్ జరిగిన కొన్ని సినిమాలు ఆ తర్వాత సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆ విధంగా తారక రత్న జీవితంలో తొమ్మిది అనేది ఒక మాయని మచ్చగా మిగిలింది. 


గుండెపోటు వచ్చిన తేదీ చూస్తే... 
సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా సక్సెస్ కాని నందమూరి తారక రత్న... కొన్ని రోజుల క్రితం రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఏపీలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బావ నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి కుప్పం వెళ్ళారు. అక్కడ ఆయన గుండెపోటుకు గురి అయ్యారు. ఆ తేదీ? జనవరి 27!


జనవరి 27... 2+7= 9! తారక రత్న జీవితంలో మరోసారి తొమ్మిది కలిసి రాలేదు. 


మరణించిన తేదీలోనూ తొమ్మిది
Nandamuri Taraka Ratna Death Date : కుప్పంలో గుండెపోటుకు గురైన తారక రత్నకు మెరుగైన వైద్యం అందించడానికి కుటుంబ సభ్యులు బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు. గత 23 రోజులుగా అనుభవజ్ఞులైన వైద్య బృందం చికిత్స అందిస్తూ వచ్చింది. మృత్యువుతో పోరాడిన తారక రత్న ఫిబ్రవరి 18న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. 18 అంటే 1+8=9! మరోసారి నందమూరి యువ కథానాయకుడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మూడు ఘటనల దృష్ట్యా తారక రత్నకు తొమ్మిది కలిసి రాలేదనే అభిప్రాయం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 


Also Read తారకరత్న పెళ్ళి ఎంత సింపుల్‌గా జరిగిందో - అందుకే ఈ ఫొటోలే సాక్ష్యం 


తారక రత్న పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాదుకు తరలించే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయానికి భాగ్య నగరంలోని మోకిలాలో గల సొంత ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్‌కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకు రానున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సభ్యులు, ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి అంతిమ యాత్ర మొదలు కానుంది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


Also Read : తారకరత్నకు టాలీవుడ్ నివాళులు - బాధను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు



తారకరత్న వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది. తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా సుమారు 25 సినిమాలు చేశారు. విజయ సాయి రెడ్డి మరదలి కుమార్తె అలేఖ్యా రెడ్డిను తారక రత్న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ అమ్మాయి ఉంది. పాప పేరు నిష్క. అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్.