Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2021లో వచ్చిన ఈ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మొదటి రూ. 100 కోట్ల సినిమాగా ‘అఖండ’ నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని, అయితే దాన్ని వీలు చూసుకుని తెరకెక్కిస్తామని బోయపాటి శ్రీను గతంలోనే తెలిపారు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను సంగీత దర్శకుడు ఎస్. ఎస్. థమన్ అందించారు. మహా శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్టులో ‘అఖండ’ సినిమా క్లిప్‌ను షేర్ చేశారు. దీని క్యాప్షన్‌లో ‘Let’s meet soon in #Akhanda2’ అని రాశారు. దీన్ని బట్టి ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని అనుకోవచ్చు.
అఖండ సినిమా గతేడాది జనవరి 21వ తేదీన ఓటీటీలో(హాట్ స్టార్) విడుదలైంది. ఓటీటీలోకి వచ్చి 24 గంటలు గడవకముందే ఈ సినిమా మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అఘోరా గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అఘోరా గెటప్ లో బాలయ్య కనిపించే ప్రతిసారి తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా కనిపించగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమా పది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకొని సత్తా చాటింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్ లో ఆయన హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమా అంటే 'గౌతమీపుత్ర శాతకర్ణి' అని చెప్పుకునేవారు. కానీ 'అఖండ' సినిమా తొలివారంలోనే ఆ సినిమా కలెక్షన్స్ ను దాటేసి ఆశ్చర్యపరిచింది.
ఇప్పుడు ఏకంగా సెంచరీ మార్క్ ను టచ్ చేసింది. నిజానికి నైజాంలో బాలయ్య సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా ఉండవు.. అలాంటిది ఆ ఏరియాలో ఈ సినిమా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆంధ్రా, రాయలసీమ కలిపి రూ.50 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇండియాలో మిగిలిన ప్రాంతాలు, అలానే ఓవర్సీస్ కలిపి ఈ సినిమా మొత్తంగా పాతిక కోట్ల వరకు గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. అంటే.. ఓవరాల్ గా ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను అందుకుంది. తొలివారంలోనే ఈ సినిమా రూ.80 కోట్ల గ్రాస్ ను సాధించింది.
బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, నితిన్ మెహతా విలన్లుగా నటించారు. ఫుల్‌రన్‌లో ఈ సినిమా రూ.150 కోట్ల వరకు గ్రాస్‌ను వసూలు చేసిందని నిర్మాతలు ప్రకటించారు. నాన్ థియేట్రికల్ రెవిన్యూని కూడా కలుపుకుని ఏకంగా రూ.200 కోట్ల వరకు బిజినెస్ ఈ సినిమా చేసిందని తెలుపుతూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
అఘోరాగా బాలకృష్ణ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. వారం, రెండు వారాలకే థియేటర్ రన్ పూర్తయిపోతున్న ఈ రోజుల్లో కూడా 103 కేంద్రాల్లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతికి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేయడం విశేషం.