కథానాయకుడు, యువ రాజకీయ నేత నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఇకలేరు. ఈ రోజు బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 22 రోజులుగా ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడటం కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి ఆయన్ను పై లోకాలకు తీసుకు వెళ్ళింది (Taraka Ratna Is No More).
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR Sr) కు తారకరత్న స్వయానా మనవడు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది.


ప్రతినాయకుడిగా తొలి సినిమాతో నంది
తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో  రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. అయితే, ఇటీవల నటన కంటే ఎక్కువ రాజకీయాలపై దృష్టి పెట్టారు. 


భార్య, అమ్మాయి...
తారకరత్నకు భార్య అలేఖ్యా రెడ్డి, ఓ అమ్మాయి ఉన్నారు. పాప పేరు నిష్క. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి భార్య చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డి.  ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న 'నందీశ్వరుడు' చిత్రానికి పని చేశారు. 


షుగర్ టాబ్లెట్స్ వేసుకోకపోవడమే
ప్రాణాల మీదకు తీసుకొచ్చిందా?
నారా లోకేష్, తారక రత్న కొన్ని రోజుల క్రితం సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఏపీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తారకరత్న పోటీ చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. అంతకు ముందు గుంటూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో సైతం తారక రత్న రాష్ట్రంలో సుపరిపాలనకు మళ్ళీ తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని చెప్పారు.


Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి జనవరి 27న తారకరత్న కుప్పం వెళ్ళారు. అక్కడ లక్ష్మీపురంలో గల మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేష్‌ (Nara Lokesh) తో పాటు నందమూరి బాలకృష్ణతో పాటూ ఆయన కూడా పాల్గొన్నారు. మసీదు నుంచి త్వరగా బయటకు వచ్చిన తారకరత్న... ఒక్కసారిగా కింద పడిపోయారు. చుట్టుపక్కల తెలుగు దేశం పార్టీ శ్రేణులు వెంటనే కుప్పంలో కేసీ ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు.


తారక రత్నకు గుండెపోటు వచ్చిందని, అయితే కొన్ని రోజులుగా ఆయన షుగర్ టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల  లెవల్స్ పెరిగినట్లు వైద్యుల నుంచి సమాచారం అందింది. గుండెలో బ్లాక్స్ ఉన్నప్పుడు స్టంట్ వేయాలంటే షుగర్ సాధారణ స్థితిలో ఉండాలని, అలా లేకపోవడం వల్ల ఆరోగ్య పరిస్థతి విషమించిందని తొలుత వార్తలు వచ్చాయి. నారాయణ హృదయాలయకు వెళ్ళిన తర్వాత పలు పరీక్షలు చేయడంతో పాటు విదేశాల నుంచి అనుభవం కల వైద్యులను కూడా రప్పించి చికిత్స అందించారు. అయినా సరే తారకరత్న ప్రాణాలు దక్కలేదు. కుప్పంలో 40 నిమిషాల పాటు తారకతర్న మెదడుకు రక్త ప్రసరణ ఆగిందని, ఆయనకు బ్రెయిన్ సమస్యలు ఉన్నాయని... మరణానికి అదే కారణం అని సమాచారం.  


Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?