తెలుగు తెరకు సీతగా పరిచయమైన మరాఠీ అమ్మాయి మృణాల్ ఠాకూర్. 'సీతా రామం', 'హాయ్ నాన్న', 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో కథానాయికగా, 'కల్కి 2898 ఏడీ'లో అతిథిగా నటించారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మరో సినిమా వచ్చింది. అయితే అందులో హీరోయిన్ రోల్ మొదట ఆవిడ దగ్గరకు రాలేదు. శృతి హాసన్ దగ్గరకు వెళ్ళింది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ దగ్గరకు వచ్చింది. సినిమా ఏది? ఇతర వివరాలు ఏమిటి? అనే అంశాల్లోకి వెళితే...
డకాయిట్... శృతి హాసన్ లేదు గురూ!
అడవి శేష్ (Adivi Sesh) కథానాయకుడిగా రూపొందుతున్న మెగా పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' (Dacoit Movie). ఇందులో కథానాయకగా మొదట శృతి హాసన్ (Shruti Haasan)ను ఎంపిక చేశారు. ఆవిడ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. శేష్, శృతి మీద తీసిన ఒక వీడియో కూడా విడుదల చేశారు. అయితే... ఏమైందో ఏమో!? ఆ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నారు. ఇప్పుడు ఆవిడ బదులు మృణాల్ ఠాకూర్ వచ్చారు. శేష్, మృణాల్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
అడవి శేష్ సరసన మృణాల్ ఠాకూర్!
అవును... సినిమాలో శృతి హాసన్ బదులు 'డకాయిట్'లో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆల్రెడీ ఆవిడతో షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికులు కలిసి ఏం చేశారనేది సినిమా కథ.
నిర్మాతగా నాగార్జున మేనకోడలు సుప్రియా యార్లగడ్డ
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డకాయిట్' సినిమాను కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియా యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాత. అడివి శేష్ 'క్షణం', 'గూఢచారి'తో సహా తెలుగులో ఇంతకు ముందు పలు సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన షానీల్ డియో 'డకాయిట్' సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అతనితో కలిసి అడవి శేషు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించునున్నారు.