బిగ్ బాస్... ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక భాగం అయ్యింది. ఏడాది అంతా ఈ షో ఉండదు. కేవలం మూడు, మూడున్నర నెలలు మాత్రమే వస్తుంది. అయితేనేం? ఆ రోజుల్లో ఇంటిల్లిపాదీ టీవీలకు అతుక్కుపోతారు. 'బిగ్ బాస్'కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్. ఆ షో మొదలైనప్పటి నుంచి ఎవరెవరికి విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి? అని డిస్కషన్ మొదలు అవుతుంది. 'బిగ్ బాస్' ఇప్పటికి ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఆయా సీజన్లలో విన్నర్స్ ఎవరు? రన్నరప్స్ ఎవరు? అనేది చూడండి.
ఎన్టీఆర్ హోస్ట్.... శివ బాలాజీ విన్నర్!
తెలుగులో 'బిగ్ బాస్' మొదటి సీజన్ జూలై 16, 2017లో మొదలైంది. ఆ షోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. సెప్టెంబర్ 24న గ్రాండ్ ఫినాలే జరిగింది. ఆ సీజన్ విన్నర్ శివ బాలాజీ. ఒకప్పుడు హీరోగా చేసిన ఆయన... ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. మరొక నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ఆ సీజన్ రన్నరప్ గా నిలిచారు.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్... కౌశల్ మండ!
'బిగ్ బాస్' సెకండ్ సీజన్ వచ్చేసరికి హోస్ట్ మారారు. ఎన్టీఆర్ బదులు నాని హోస్ట్ చేశారు. ఆ సీజన్ 112 రోజులు సాగింది. జూన్ 10, 2018 నుంచి సెప్టెంబర్ 30 వరకు షో కంటిన్యూ అయ్యింది. అందులో కౌశల్ మండ విజేతగా నిలిచారు. సింగర్ గీతా మాధురి రన్నరప్. ఆ షో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. నానిని సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత నుంచి నాని హోస్ట్ చేయడం మానేశారు.
ఆస్కార్ కంటే ముందు బిగ్ బాస్ విన్నర్!
'బిగ్ బాస్' మూడో సీజన్ నుంచి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు. 'బిగ్ బాస్ 3' జూలై 21, 2019లో మొదలై నవంబర్ 3న ముగిసింది. ఆస్కార్ వేదికపై 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాడిన హైదరాబాదీ యువకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్. ఫేమస్ యాంకర్ శ్రీముఖి రన్నరప్.
'బిగ్ బాస్ 4'... మోస్ట్ హ్యాండ్సమ్ విన్నర్ అభిజిత్!
'బిగ్ బాస్' సీజన్ 4 సెప్టెంబర్ 6, 2020లో మొదలై 105 రోజుల పాటు సాగింది. ఆ షో డిసెంబర్ 20, 2019లో ముగిసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, హీరో అభిజీత్ విజేతగా నిలిచారు. ఆ సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్. ఆ తర్వాత వేరే టీవీ షోలు చేశారు.
టీవీ యాంకర్ నుంచి బిగ్ బాస్ 5 విన్నర్ వరకు!
'బిగ్ బాస్' సీజన్ 5కు ఒక ప్రత్యేకత ఉంది. అప్పటి వరకు విన్నర్ అంటే సినిమా సెలబ్రిటీ లేదా పాపులర్ సింగర్, క్రేజ్ ఉన్న నటుడు అన్నట్టు ఉంది. కానీ, ఐదో సీజన్ ట్రోఫీ వీజే సన్నీకి ఇచ్చారు. టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... విజేతగా నిలవడం గొప్ప విషయం. సెప్టెంబర్ 5 నుంచి డిసెంబర్ 19, 2021 వరకు సాగిన ఆ షోలో షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్.
సెప్టెంబర్ 4 నుంచి డిసెంబర్ 18, 2022 వరకు జరిగిన 'బిగ్ బాస్ 6'లో సింగర్ ఎల్వీ రేవంత్ విన్నర్ కాగా... యూట్యూబర్ శ్రీహాన్ రన్నరప్. లాస్ట్ సీజన్... అంటే 'బిగ్ బాస్ 7'లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్, సినిమాల్లో హీరోగానూ నటిస్తున్న అమర్ దీప్ చౌదరి రన్నరప్ అయ్యారు.
బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరు? గౌతమ్ లేదా నిఖిల్!
'బిగ్ బాస్ 8' గ్రాండ్ ఫినాలే సీజన్ ఇవాళ రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో విన్నర్ గౌతమ్ లేదా నిఖిల్ అవుతారని లీకులు వస్తున్నాయి. మరి, ఎవరు విజేతగా నిలుస్తారో? 'బిగ్ బాస్' ఎవరిని విన్నర్ అంటాడో చూడాలి.