బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ జోష్ లో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్న కింగ్ ఖాన్, ఇప్పుడు 'జవాన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా 'జిందా బందా' అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.  


ఇప్పటికే విడుదలైన 'జవాన్' ప్రీవ్యూ టీజర్ సినిమాకు కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది. అలానే ప్రధాన నటీనటుల క్యారక్టర్ పోస్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని, అంచనాలు మరింత పెంచాయి. సినీ ప్రియుల ఆసక్తిని రెట్టింపు చేయడానికి ‘జిందా బందా’ అనే టైటిల్ సాంగ్ ను వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ పాట చిత్రీకరణకు సంబంధించిన విశేషాలు, ఖర్చు చేసిన బడ్జెట్ వంటి అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


15 కోట్ల బడ్జెట్‌.. 1000+ లేడీ డ్యాన్సర్స్


‘జిందా బందా’ పాటను చెన్నైలో ఐదు రోజుల పాటుగా భారీ స్థాయిలో చిత్రీకరించారు. దీని కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, మధురై, ముంబై నగరాల నుంచి 1000 మందికి పైగా మహిళ డ్యాన్సర్లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణకు దాదాపు రూ. 15 కోట్ల వరకు ఖర్చు అయినట్లు చిత్రబృందం తెలిపింది. రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ స్పెషల్ గా నిలుస్తుందని అంటున్నారు. 


Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?


అనిరుద్ ‘జిందా బందా’ పాటకు ట్యూన్ సమకూర్చడమే కాకుండా, స్వయంగా ఆలపించారు. డ్యాన్స్ మాస్టర్ శోభి ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసారు. షారూఖ్ ఖాన్ మునుపెన్నడూ లేని విధంగా వెయ్యి మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేయడం మరింత ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అనిరుధ్ కంపోజ్ చేసిన 'వాతి కమింగ్', 'అరబిక్ కుతు', విక్రమ్ థీమ్ సాంగ్, 'కావాలయ్యా' వంటి పాటలు ఇంటర్నెట్ ను షేక్ చేసాయి. మరి జిందా బందా పాట ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. 


'జవాన్' సినిమాలో షారుఖ్ తో పాటుగా నయనతార, విజయ్ సేతుపతి మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా వంటి ప్రముఖ నటీనటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో దాదాపు 250+ కోట్ల బడ్జెట్ తో గౌరీ ఖాన్ ఈ సినిమాని నిర్మించారు. సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 7న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Read Also: ఆరేళ్లుగా బిగ్ స్క్రీన్ పై క‌నిపించని ఇద్దరు టాలెంటెడ్ హీరోలు, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial