ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు. చిన్న మీడియం రేంజ్ హీరోలు కూడా చేతి నిండా సినిమాలు కలిగి ఉన్నారు. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకుని, దాని ప్రకారం ప్లాన్స్ చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో, ఏడాది పొడవునా షూటింగులతో బిజీ బిజీగా గడిపిన కొందరు హీరోలు మాత్రం.. చాలా కాలంగా బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. కారణాలు ఏవైనా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదారేళ్ళ గ్యాప్ తీసుకున్న హీరోలున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ హీరోలెవరు? వారి కంబ్యాక్ సినిమాలేంటో చూద్దాం.


2017 నుంచి సినిమాలకు దూరంగా మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చివరగా 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. 2017లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత మనోజ్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆ మధ్య తన హోమ్ ప్రొడక్షన్ లో 'అహం బ్రహ్మష్మి' అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేసారు. హీరో రామ్ చరణ్ ను గెస్టుగా పిలిచి గ్రాండ్ గా లాంచ్ చేసారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఆదిలోనే ఆగిపోయింది. ఆ సమయంలోనే మంచువారబ్బాయి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడని, రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన మనోజ్.. దాదాపు ఆరేళ్ళ తర్వాత 'వాట్ ది ఫిష్' (What The Fish) అనే చిత్రాన్ని ప్రకటించారు. 


ఇప్పటికే విడుదలైన 'వాట్ ది ఫిష్' మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. మనోజ్ మరోసారి సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నారని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రానికి వరుణ్ కోరుకొండ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండగా, విశాల్ మరియు సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి. ఇక దీనితో పాటు మంచు మనోజ్‌ ఎల్‌ఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయనున్నారని టాక్. దీనికి భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా దొంగ దొంగది, నేను మీకు తెలుసా?, బిందాస్, వేదం, కరెంట్ తీగ వంటి చిత్రాలతో అలరించిన మనోజ్.. మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 


Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?


ఐదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా నారా రోహిత్
మంచు మనోజ్ మాదిరిగానే ఇండస్ట్రీ నుంచి లాంగ్ లీవ్ తీసుకున్న హీరో నారా రోహిత్. 2009లో 'బాణం' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రోహిత్.. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానందా, శమంతకమణి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే 2018లో 'వీర భోగ వసంత రాయలు' చిత్రం తర్వాత నారా రోహిత్ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. ఇన్నాళ్లూ అసలు ప్రేక్షకుల దగ్గరకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, రాజకీయాల్లో బిజీగా వున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు 'ప్రతినిధి 2' సినిమా అనౌన్స్ మెంట్ తో వచ్చాడు. 


జర్నలిస్ట్ మూర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'ప్రతినిధి 2' అనే మూవీ చేస్తున్నారు నారా రోహిత్. ఫస్ట్‌ లుక్‌ గ్లిమ్స్ ని బట్టి ఇదొక యూనిక్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కే పొలిటికల్ డ్రామా అని అర్థమవుతోంది. 'ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మళ్లీ నిలబడతాడు' అనే కోట్ సినిమాలో హీరో పాత్రను సూచిస్తోంది. ఐదేళ్ల విరామం తర్వాత రోహిత్ నటిస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2024 జనవరి 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే నారా రోహిత్ లైనప్ లో 'పండగలా వచ్చాడు', 'శబ్ధం', 'మద్రాసీ', 'అనగనగా దక్షిణాదిలో' వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకూ వీటికి సంబంధించి ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. మరి రానున్న రోజుల్లో ఈ సినిమాలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. 


Read Also: భయపెడుతోన్న ప్రభాస్, అయోమయంలో యశ్ - పాన్ ఇండియా స్టార్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial