ఇటీవల కాలంలో దక్షిణాది చిత్రాలు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. మన సినిమాల దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరోల మూవీస్ నిలబడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ సౌత్ హీరో కూడా తమ సినిమాలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేసి మార్కెట్ విస్తరించుకోవాలని చూస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే అలాంటి స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న హీరోలు మాత్రం కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తోంది.


ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యశ్ వంటి సౌత్ హీరోలను పాన్ ఇండియన్ స్టార్స్ గా పరిగణిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి: ది బిగినింగ్' & 'బాహుబలి: ది కన్క్లూజన్' సినిమాలతో పాన్ ఇండియా హీరోగా అవతరించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' చిత్రంతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. KGF మూవీతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్.


'బాహుబలి'తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను కాపాడుకునేలా, ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. అయితే 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీసు వసూళ్ళు సాధించలేకపోయాయి. అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యాయి. బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలు నిరాశ పరచడంతో, ఇప్పుడు డార్లింగ్ కచ్ఛితంగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి తన స్టామినా ఏంటో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రభాస్ సిచ్యుయేషన్ తమకు కూడా వస్తుందేమోనని మిగతా పాన్ ఇండియా స్టార్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


'KGF 2' మూవీ సంచలన విజయం సాధించిన తర్వాత, యశ్ మరో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ తో వస్తాడని అందరూ భావించారు. ఫలానా డైరెక్టర్ తో చేస్తాడంటూ అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకూ తన కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అసలు ఎవరితో చేయనున్నాడనే క్లారిటీ కూడా లేదు. నెలలు గడుస్తున్నాయి కానీ, హీరో మాత్రం తన తదుపరి చిత్రం విషయంలో సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని సరైన స్క్రిప్టుతో రావడం కోసమే యశ్ సమయం తీసుకుంటున్నాడని అర్థమవుతోంది.


Read Also: మగాడివైతే 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీయాలన్న నెటిజన్ - కౌంటర్ ఎటాక్ చేసిన 'కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్!


'పుష్ప 1' రిలీజైన నాలుగు నెలల్లోనే 'పుష్ప 2' సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. కానీ మొదటి భాగం ఎవరూ ఊహించని విధంగా నార్త్ బెల్ట్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో, రెండో పార్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. అంచనాలు భారీ స్థాయిలో వుండటంతో, వాటికి ఏమాత్రం తగ్గకుండా సినిమాని తెరకెక్కించాలని బన్నీ అండ్ టీమ్ ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసమో ఎక్కువ టైం తీసుకున్నారు సుకుమార్. అన్నీ పక్కాగా కుదిరిన తర్వాతే షూటింగ్ కు వెళ్లారు. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. 


RRR సినిమా తర్వాత మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ చాలా సమయమే తీసుకున్నారు. 'దేవర' సినిమా గురించిన అధికారిక ప్రకటన అప్పుడెప్పుడో ఇచ్చినప్పటికీ, షూటింగ్ స్టార్ట్ చేయడానికి టైం పట్టింది. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తీసిన దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మూవీ ఇది. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి సినిమా తర్వాత హీరో కెరీర్ సాఫీగా సాగదనే బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఇండస్ట్రీలో ఉండనే వుంది. గతంలో తారక్ ఆ అనుభవాన్ని రుచి చూశాడు కూడా. అందుకే అవన్నీ దృష్టిలో పెట్టుకొని తన కొత్త సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


మరో ట్రిపుల్ ఆర్ హీరో రామ్ చరణ్ సైతం పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత స్లో అండ్ స్డడీగా వెళ్తున్నారు. తన తండ్రితో కలిసి నటించిన 'ఆచార్య' సినిమా ఫ్లాప్ అవడంతో కాస్తనిరాశ చెందారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. అయితే చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా ఎంత వరకూ వచ్చింది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనేది తెలియడం లేదు. అలానే అధికారికంగా ప్రకటించిన బుచ్చిబాబు సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారనేది తెలియాల్సి వుంది.


మొత్తం మీద పాన్ ఇండియా స్టార్స్ అందరూ తమ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది. ప్రభాస్ పరిస్థితి రాకుండా చూసుకోవాలని తమ కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. కాకపొతే పరాజయాలు పలకరించినా డార్లింగ్ స్టార్‌డమ్‌ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఫ్లాప్ చిత్రాలే ఈజీగా రూ.300 కోట్లు వసూలు చేస్తున్నాయంటేనే, ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ఇటీవల విడుదలైన టీజర్లతో, 'సలార్' & 'కల్కి 2898 A.D' సినిమాల చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈసారి రెబల్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.


Read Also: Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial