వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. 'ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో ఓవర్ నైట్ సెన్సేషన్‌ డైరెక్టర్ గా మారిపోయిన ఆయన, సినిమాలతోనే కాదు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అతను వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తారని, ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తారని దర్శకుడిపై విమర్శలు కూడా వస్తుంటాయి. అయితే లేటెస్టుగా మణిపూర్ ఫైల్స్ పేరుతో సినిమా తీయాలని ఓ నెటిజన్ సవాలు విసరడం, వివేక్ అతనితో మాటల యుద్ధానికి దిగడం నెట్టింట హాట్ టాపిక్ అయింది. 


వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌రిపోర్టెడ్‌’ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ట్వీట్ చేస్తూ.. ''కాశ్మీరీ హిందువుల మారణహోమం విషయంలో భారత న్యాయవ్యవస్థ గుడ్డిదానిలా, మూగదానిలా నిలబడి ఉంది. మన రాజ్యాంగంలో వాగ్దానం చేసినట్లు కాశ్మీరీ హిందువుల జీవించే హక్కును రక్షించడంలో విఫలమైంది. ఇప్పటికీ విఫలమవుతూనే ఉంది'' అని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ, ‘మణిపూర్ ఫైల్స్’ మీద సినిమా తీయమని నిలదీసాడు. 


"సమయం వృధా చేసుకోకండి, నువ్వు సరైన మగాడివైతే 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీసి చూపించు" అని నెటిజన్ ప్రశ్నించారు. దీనికి అగ్నిహోత్రి స్పందిస్తూ "నాపై ఇంత నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. అన్ని సినిమాలు నేనే తీస్తే ఎలా.. మీ టీమ్‌ ఇండియాలో చాలా మంది సరైన మగవాళ్లు ఉన్నారు కదా'' అంటూ వ్యంగ్య ధోరణిలో ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దర్శకుడికి మద్దతుగా నిలిస్తే, మరికొందరు ఫైర్ అవుతున్నారు. కాశ్మీరీ హిందూ పండిట్ల కథను కశ్మీర్‌ ఫైల్స్‌ గా తెర మీదకు తీసుకొచ్చినట్లు మణిపూర్ దుర్ఘటనలు సినిమాగా తీయమని అడగడంలో తప్పేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సమాధానంతో దర్శకుడు అధికారిక పార్టీకి కొమ్ముకాస్తున్నారని పరోక్షంగా అంగీకరించారని కామెంట్లు పెడుతున్నారు. 






మణిపూర్‌ లో ఏం జరిగింది?
మణిపూర్ లో కొన్ని జాతులు వర్గాల నడుమ సంఘర్షణతో గత కొన్ని రోజులుగా రాష్ట్రం అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. మణిపూర్ హింసకు సంబంధించిన ఓ పాత వీడియో జూలై 19న ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. అందులో కొంతమంది పురుషులు ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి. ఈ ఘటనపై వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించారు. ఆ వీడియోలోని ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పాడు. 


“అంతిమంగా ప్రతిసారీ మన అమాయక తల్లులు, సోదరీమణులు ఇలాంటి అమానవీయ అనాగరిక చర్యలకు బాధితులవుతున్నారు. ఒక భారతీయుడిగా, ఒక పురుషుడిగా, ఒక మనిషిగా నేను ప్రతిసారీ తల్లడిల్లిపోతున్నాను. నేను సిగ్గుపడుతున్నాను. నా నిస్సహాయతకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఓ మణిపూర్, నేను ప్రయత్నించాను... ప్రయత్నించాను... కానీ విఫలమయ్యాను. నేను ఇప్పుడు చేయగలిగేది నా పని ద్వారా వారి విషాద కథలను చెప్పడం. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. నా సోదరీమణులారా నన్ను క్షమించండి, నా తల్లులారా నన్ను క్షమించండి, భారత్ మాతా నన్ను క్షమించు'' అంటూ వివేక్ అగ్నిహోత్రి ఎమోషనల్ ట్వీట్ చేశారు. 


ఇక సినిమాల విషయానికొస్తే, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం పై 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే మూవీ తీసి విమర్శకుల ప్రశంసలతో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు వివేక్ అగ్నిహోత్రి. 1990లో కశ్మీర్ లోయలో జరిగిన దారుణ మారణకాండ.. కాశ్మీర్ పండిట్ల హృదయాన్ని కదిలించే కథనంతో 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కరోనా పాండమిక్ నేపథ్యంలో 'ది వ్యాక్సిన్ వార్' అనే సినిమా రూపొందిస్తున్నారు వివేక్. అలానే 'ది ఢిల్లీ ఫైల్స్' అనే మరో వైవిధ్యమైన సినిమా కూడా విలక్షణ దర్శకుడి లైనప్ లో ఉంది. 


Read Also: Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial