Oppenheimer: హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కు సినిమాలు ప్రత్యేకశైలిని కలిగి ఉంటాయి. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో 'బ్యాట్ మ్యాన్ బిగిన్స్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్', 'డంకర్క్' వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇండియాలోనూ నోలన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకుల్లో నోలన్ ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తారు. ఆ దర్శకుడి నుంచి వచ్చిన తాజా సినిమా ‘ఓపెన్ హైమర్’. అమెరికా శాస్త్రవేత్త, అణుబాంబు పితామహుడు అయిను ఓపెన్ హైమర్ పేరుతోనే ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు నోలన్. ప్రస్తుతం ఈ సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడీ సినిమా కొత్త చిక్కుల్లో పడింది. మూవీలో భగవద్గీతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని,  సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని కొంతమంది హిందూవర్గానికి చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 


బోల్డ్ సీన్స్ సమయంలో భగద్గీత ప్రస్తావన?


‘ఓపెన్ హైమర్’ సినిమాపై భగద్గీత ప్రభావం కూడా ఉంటుంది. సినిమాలో అది స్పష్టంగా కనిపిస్తుంది. మూవీ రిలీజ్ కు ముందు నుంచీ కూడా ఈ వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే సినిమాలో భగవద్గీత ప్రభావం సినిమాలో కనిపిస్తుంది. అయితే మూవీలోని ఒక సన్నివేశంలో ఫ్లోరెన్స్ పగ్ పాత్రధారి జీన్ టాట్‌ లాక్‌, ఓపెన్ హైమర్ మధ్య వచ్చే   శృంగార సన్నివేశంలో నటి భగద్గీత చదువుతున్నట్టుగా చూపించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. దీనిపై కొన్ని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. దీనిపై నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. దర్శకుడు నోలన్ తన సినిమాలో భగవద్గీత గురించి ప్రస్తావించడం బాగుంది, కానీ బోల్డ్ సన్నివేశాల్లో పవిత్రమైన భగవద్గీత గురించి చూపించడం సరికాదని అంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ సన్నివేశాలను తొలగించాలని, మూవీను ఇండియాలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఈ సినిమాలో కేవలం ఒక్క బోల్డ్ సన్నివేశంలోనే భగవద్గీత ప్రస్తావన రాలేదు. సినిమాలో చాలా వరకూ భగవద్గీత ప్రభావం కనిపిస్తుంది. నిజానికి నిజ జీవితంలో కూడా ఓపెన్ హైమర్ భగవద్గీతతో పాటు పలు హిందూ పురాణ గ్రంథాలను చదివాడు. ఆయన సంస్కృత భాషను ఎక్కువగా ఇష్టపడేవాడట. అయితే తనని తాను ఎప్పుడూ హిందువుగా చెప్పుకోలేదని అంటారు. భగవద్గీతలోని ఓ శ్లోకం ఓపెన్ హైమర్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. అదే ఆయనలో పరివర్తనకు కారణం అయిందని చెబుతారు. మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కీలన్ మర్ఫీ కూడా సినిమాలో తన పాత్రకు సిద్ధమవుతున్న సమయంలో భగవద్గీత చదివినట్లు సమాచారం.


‘ఓపెన్ హైమర్’ సినిమా కథేంటంటే..


రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అణు బాంబు తయారు చేయమని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ ని అమెరికన్ అటామిక్ ఎనర్జీ అధ్యక్షుడు లూయిస్ స్ట్రాస్ సంప్రదిస్తారు. లాస్ అల్మాస్ పేరుతో ఓ నగరాన్ని నిర్మించి, కొంత మంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాలు చేస్తారు. విజయవంతంగా అణుబాంబు తయారు చేస్తారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా ప్రభుత్వం ఆ బాంబులు వేస్తుంది. అణుబాంబు తయారీకి ముందు ఓపెన్ హైమర్ జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అణుబాంబు ప్రయోగించిన కొన్నేళ్ళ తర్వాత ఓపెన్ హైమర్ మీద అమెరికా ప్రభుత్వం ఎందుకు ట్రయిల్ చేపట్టింది? అనేది సినిమా ఇక ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించారు. మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, రామి మాలెక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. 


Also Read: ఆగస్టులో కాదు, లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే? అదీ ఎక్కడంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial