తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘కంగువా’. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కంగువా’ గ్లింప్స్‌ను సూర్య పుట్టినరోజు సందర్భంగా జులై 23వ తేదీన అర్థ రాత్రి 12:01 గంటలకు విడుదల చేశారు. సూర్య ఈ సినిమాలో యోధుడి పాత్రలో నటిస్తున్నాడు.


ఇక గ్లింప్స్ విషయానికి వస్తే... గుట్టలు గుట్టలుగా ఉన్న శవాలపై నుంచి సూర్య ఎంట్రీ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తనకు ఎలివేషన్ ఇస్తూ ‘అఖిలాండం ఏలిన మారాక్రుని వంశకుడు...’ అంటూ సాగే సాంగ్, చివర్లో రోలెక్స్ ఎక్స్‌ప్రెషన్‌ను గుర్తు చేస్తూ ‘కుశలమా’ అనే సూర్య డైలాగ్‌తో తన ఫేస్‌ను రివీల్ చేయడం, వేలాది మంది సైన్యం బాణాలు వేయడం... ఒక విజువల్ ఫీస్ట్‌గా కట్ చేశారు.



ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. సూర్య, దిశా పటానీలతో పాటు యోగి బాబు, రెడిన్ కింగ్‌స్లే, కోవై సరళ, ఆనంద రాజ్, కేఎస్ రవికుమార్, జగపతి బాబు, నటరాజ్ సుబ్రమణ్యం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


‘కంగువా’ గ్లింప్స్‌కు దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతం అందించారు. ఇటీవల కాలంలో దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ వర్క్ అంటే ఇదేనని చెప్పవచ్చు. ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సూర్య కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా.


పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్లింప్స్‌లో కేవలం పీరియాడిక్ టైమ్‌లైన్ మాత్రమే చూపించారు. దీంతోపాటు ప్రస్తుత కాలానికి సంబంధించిన కథ కూడా ఉంటుందట. ఆ పార్ట్‌ను ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్‌కు తగ్గట్లు దీనికి కూడా సీక్వెల్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఒకే కథను రెండు భాగాలుగా చెప్తారా? లేకపోతే మొదటి భాగం విజయవంతం అయితే రెండో భాగం తీస్తారా అన్నది తెలియాల్సి ఉంది.


దర్శకుడు శివ తమిళంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరు. మొదట్లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన శివ తెలుగులో గోపిచంద్ ‘శౌర్యం’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత గోపిచంద్‌తోనే ‘శంఖం’ అనే సినిమా తీశారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తమిళంలో కార్తీ హీరోగా ‘సిరుత్తై’ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రానికి ఇది తమిళ రీమేక్.


‘సిరుత్తై’ తర్వాత వెంటనే తెలుగులో రవితేజతో ‘దరువు’ సినిమా తీశారు. అనంతరం పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు. అజిత్‌తో వరుసగా నాలుగు సినిమాలు తీశారు. ‘వీరం (ఈ సినిమాను తెలుగులో ‘కాటమరాయుడు’గా రీమేక్ చేశారు)’, ‘వేదాళం (ప్రస్తుతం ‘భోళా శంకర్‌’గా రీమేక్ చేస్తున్నారు)’, ‘వివేగం’, ‘విశ్వాసం’ సినిమాలు ఆయన వరుసగా అజిత్‌తో చేశారు. వీటిలో ‘వివేగం’ తప్ప మిగతావన్నీ బ్లాక్‌బస్టర్లే.‘విశ్వాసం’ తర్వాత రజనీకాంత్ హీరోగా ‘అన్నాత్తే’ సినిమాను తెరకెక్కించారు. కానీ అది భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినా కానీ శివ చెప్పిన కథ నచ్చడంతో సూర్య ‘కంగువా’ అవకాశం ఇచ్చారు.